శ్రావణి మర్డర్ కేసు: బీరు బాటిళ్ల ఆధారంగా ఏడుగురు అరెస్ట్

  • Publish Date - April 29, 2019 / 01:39 AM IST

తెలంగాణలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్‌కు చెందిన టెన్త్‌ విద్యార్థిని శ్రావణి హత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్‌ చేశారు. విద్యార్థిని మర్డర్‌ కేసులో శ్రీనివాస్‌రెడ్డి అనే నిందితుడితో సహా పోలీసులు ఎడుగురు అనుమానిత వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. శ్రీనివాస్‌రెడ్డిపై గతంలో వరంగల్‌ జిల్లాలో రేప్‌ కేసు ఫైల్‌ అయినట్టు తెలుస్తోండగా.. ఘటన జరిగిన స్థలంకు దగ్గరిలో పడి ఉన్న బీరు సీసాల మీద వేలుముద్రలు ఆధారంగా మరికొందిరిని అరెస్ట్ చేశారు.

శ్రీనివాస్‌రెడ్డి సైకోలా ప్రవర్తిస్తాడని హజీపూర్‌ గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం పల్సర్‌ వాహనాన్ని ఎత్తుకెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి.. ప్రస్తుతం శ్రావణిని హత్య చేసిన ప్రాంతంలోనే పూడ్చిపెట్టాడని గ్రామస్తులంటున్నారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డిపై రాత్రి పొద్దుపోయే వరకు బీబీ నగర్‌ పీఎస్‌లో పోలీసులు విచారించారు. శ్రావణిని హత్య చేసింది శ్రీనివాస్‌రెడ్డేనా.. లేక మరొకరి పనా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్ల అయ్యే పనేనా? ఈ దారుణానికి ఒడిగట్టడానికి వెనుక కారణాలేంటన్నది ఉత్కంఠ రేపుతోంది.

బొమ్మలరామారం ఎస్సై వెంకటేష్‌పై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ డీసీపీ ఉత్తర్వలు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌… హంతకుల్ని పట్టుకునేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా మిస్టరీని ఛేదించేందుకు ఎస్‌వోటీ డీసీపీ, షీ టీమ్‌ అడిషనల్‌ డీసీపీ, ఐటీ సెల్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.