సుప్రీంకోర్టులో నిర్భయ దోషులకు చుక్కెదురైంది. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు నిర్భయ దోషుల అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వినయ్, ముఖేశ్ పిటిషన్లను మంగళవారం (జనవరి 14, 2020) అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జనవరి 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడనుంది.
డెత్ వారెంట్ పై స్టే విధించి ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని వినయ్ శర్మ (26), ముఖేశ్ (32) క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని జస్టిస్ అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారీమణ్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్ లతో కూడిన ఐదు జడ్జీల ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది.
క్యూరేటివ్ పిటిషన్లను విచారించేందుకు అర్హత లేని కారణంగా సుప్రీం వారిద్దరిని పిటిషన్లను తోసిపుచ్చింది. గతం నుంచి శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ప్రయత్నిస్తున్నారనే కోణంలో వినయ్, ముఖేశ్ క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. చివరి అవకాశంగా రాష్ట్రపతి క్షమాభిక్ష ఒక్కటే మిగిలి ఉంది. ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ ప్రకారం.. జనవరి 22, ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రపతి ఒకవేళ వారికి క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మారే అవకాశం ఉంటుంది. తమ క్యూరేటివ్ పిటిషన్లలో కూడా దోషులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ పై స్టేట్ విధించి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరారు. చిన్న వయస్సు, వారి ఆర్థికపరంగా కుటుంబ పరిస్థితులు, రాజకీయంగా వస్తున్న ఒత్తిడులతో నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ అయింది.
2012లో నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు నిర్భయ దోషుల్లో అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) అనే మిగిలిన ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లను ఇంకా దాఖలు చేయాల్సి ఉంది. గతంలోనే ఈ నలుగురు దోషులు రివ్యూ పిటిషన్లను దాఖలు చేయగా సుప్రీంకోర్టు కొట్టివేసింది.