సెల్‌ఫోన్‌తోనే సీక్రెట్‌గా మహిళల వీడియోలు తీశాడు- స్కానింగ్ సెంటర్‌లో వికృత చేష్టలపై సీపీ

ఇందులో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందన్నారు సీపీ.

Ayyappa Scanning Center : నిజామాబాద్ లో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో ఆపరేటర్ వికృత చేష్టల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ స్పందించారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ తో పాటు మరో ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళల అశ్లీల వీడియోలు రికార్డింగ్ చేశారని సీపీ తెలిపారు. దీనిపై ఫిర్యాదు రాగానే స్పందించి విచారణ చేశామన్నారు. స్కానింగ్ సెంటర్ లో పని చేస్తున్న టెక్నీషియన్ ప్రశాంత్.. రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశామన్నారు.

ప్రశాంత్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ తో పాటు మరో ఆస్పత్రిలో ప్రశాంత్ వీడియోలు తీసినట్లు గుర్తించామన్నారు. ఇందులో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందన్నారు సీపీ. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేస్తున్నారని వెల్లడించారు. స్కానింగ్ సెంటర్ల వ్యవహారంపై కమిటీ వేశామన్నారు. టెక్నీషియన్ ప్రశాంత్ సెల్ ఫోన్ తోనే వీడియోలు తీశాడని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెప్పారు.

నలుగురు సీనియర్ మహిళా డాక్టర్లతో కమిటీ..
నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఘటన విషయంలో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కేసు విచారణకు నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. నలుగురు సీనియర్ మహిళా వైద్యులు విచారణ కమిటీలో ఉన్నారు. సీనియర్ మహిళా డాక్టర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ అంజనా, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్లు లావణ్య, అనుపమ, రేడియాలజిస్ట్ శ్రావణి ఈ కమిటీలో ఉన్నారు. స్కానింగ్ సెంటర్ లో ఏం జరిగింది? అనే విషయంపై వారం రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు, టెక్నీషియన్ ప్రశాంత్ మీద చర్యలు తీసుకోనున్నారు.

Also Read : ఖమ్మం జిల్లాలో కారు ప్రమాద ఘటనపై అనుమానాలు.. భర్తపై ఆరోపణలు, ఉరి తీయాలని డిమాండ్

ట్రెండింగ్ వార్తలు