Older Brother Killed Younger Brother
older brother killed younger brother, due to marriage cancellation : అన్నకోసం పెళ్లి చూపులు చూసిన వధువు తోడుగా వచ్చిన తమ్ముడ్ని చూసి మెచ్చింది. సరే ఇంట్లో ఎవరికో ఒకరికి పెళ్లవుతోంది కదా అని పెద్దలు తమ్ముడితో నిశ్చితార్ధం చేశారు. దీంతో అన్నదమ్ముల మధ్య ద్వేషం పెరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోయే తమ్ముడిని హత్య చేశాడు.
విశాఖజిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు జాలరి పాలెంలో నివసించే మడ్డు రాజు అనే వ్యక్తి నెల రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి భీమిలికి వెళ్లి పెళ్లి చూపులు చూసి వచ్చాడు. అమ్మాయి నచ్చిందని వారికి చెప్పాడు రాజు. ఇరు కుటంబాలవైపు పెద్దలు సంబంధం ఖాయం చేసుకున్నారు.
కొద్ది రోజుల తర్వాత అమ్మాయి పెళ్లికి అభ్యంతరం చెప్పింది. రాజు తమ్ముడు ఎర్రయ్య నచ్చాడు అని అతడితో పెళ్లి చేయమని తల్లి తండ్రులను కోరింది. ఇరు వర్గాల వారు మళ్లీ మాట్లాడుకున్నారు. అబ్బాయి తల్లి తండ్రులు అందుకు అంగీకరించారు.
తమ్ముడు ఎర్రయ్యతో నిశ్చితార్ధం జరిపి వచ్చే నెలలో వివాహం జరిపించాలని ముహూర్తం పెట్టుకున్నారు. అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎర్రయ్య ఆదివారం చేపల వేటకు వెళ్లి రూ.2వేలు సంపాదించుకు వచ్చాడు.
ఆ డబ్బు సెల్ ఫోన్ కొనుక్కునేందుకు అన్నకు ఇవ్వాలని తల్లి సూచించింది. ఈవిషయమై సోమవారం ఇద్దరు అన్న దమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఎర్రయ్య బయటకు వెళ్లి పోయాడు. ఇంట్లో కత్తితో మాటు వేసిన రాజు….మధ్యాహ్నం ఇంటికి తిరిగివచ్చిన ఎర్రయ్య పై దాడిచేశాడు. దాడిలో ఎర్రయ్య మెడకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతడ్ని అనకాపల్లితరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయాడు.