జూబ్లీహిల్స్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెద్దమ్మ టెంపుల్ ఈవో సైకం అంజనారెడ్డి ఒక అర్చకుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెద్దమ్మ టెంపుల్ ఈవో సైకం అంజనారెడ్డి ఒక అర్చకుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పెద్దమ్మ టెంపుల్ లో ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక అర్చకుడిగా పని చేస్తున్న ప్రయాగ ఆంజనేయ శర్మ.. 2017 లో ఒక భక్తుడు ఇచ్చిన 50 వేల రూపాయల విరాళాన్ని జనరల్ రసీదులో రూ. 10 వేలుగా రాసి 40 వేలు తనే ఉంచుకున్నాడు.
ఈ విషయం ఆనోటా, ఈనోటా బయటకు వచ్చి…అప్పటి ఈవో బాలాజీ.. అర్చకుడిని సస్పెండ్ చేశారు. 2014 కంటే ముందు ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయమని సీఎం కేసీఆర్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ఆధారంగా అప్పటికే 15 ఏళ్ళ నుంచి పెద్దమ్మగుడిలో అర్చకుడిగా పని చేస్తున్న ఆంజనేయ శర్మను రెగ్యులరైజ్ చేయమని ఉత్తర్వులు వచ్చాయి. ఆంజనేయ శర్మపై సస్పెన్షన్ ఎత్తివేసి, ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రస్తుత ఈవో అంజనా రెడ్డి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.
ఇది కాక అప్పటికే శర్మ ఖాతాలో జమ అయిన లక్షా 25 వేల రూపాయల వేతనం కూడా తనకే ఇవ్వాలని ఈవో డిమాండ్ చేశారు. చివరికి 4 లక్షల రూపాయల నగదు, బ్యాంకులో జమ అయిన లక్షా 25 వేల రూపాయలు జీతం ఇచ్చేలా ఈవో ఒప్పందం చేసుకున్నారు. ఈవో ప్రవర్తనతో విసిగిపోయిన ఆంజనేయ శర్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం (మే 7,2019) మధ్యాహ్నం ఈవో అంజనా రెడ్డికి.. అర్చకుడు నగదు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈవోని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.