జీతం కట్ చేసిందని, మహిళా అధికారి దగ్గరకు పెట్రోల్ తీసుకెళ్లింది…

  • Publish Date - March 7, 2020 / 08:17 AM IST

విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 6 ఆఫీస్ లో కలకలం రేగింది. ఏఎంహెచ్ వో లక్ష్మీతులసిపై పెట్రోల్ దాడికి యత్నం జరిగింది. శానిటరీ సూపర్ వైజర్ అన్నామణి ఈ దాడికి పాల్పడింది. ఈ దాడి నుంచి లక్ష్మీతులసి తృటిలో తప్పించుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అన్నామణి నుంచి పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. అన్నామణి, లక్ష్మీతులసి మధ్య వివాదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. జీతం కట్ చేసిందనే కోపంతో అన్నామణి ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం.

అన్నామణి గోపాలపట్నం లక్ష్మీనగర్ లో శానిటరీ సూపర్ వైజర్ గా పని చేస్తోంది. అన్నామణి 20 రోజులు డ్యూటీకి రాకపోవడంతో లక్ష్మీతులసి ఆమె జీతం కట్ చేసింది. దీంతో కక్ష కట్టిన అన్నామణి తనపై దాడికి యత్నించిందని లక్ష్మీతులసి ఆరోపించింది. అన్నామణి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. దీనిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

శనివారం(మార్చి 7,2020) ఉదయం ఈ ఘటన జరిగింది. అన్నామణి ఓ కూల్ డ్రింక్ బాటిల్ లో పెట్రోల్ తెచ్చుకుంది. ఏఎంహెచ్ వో గదిలోకి వెళ్లిన అన్నామణి.. ఆమె వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ బయటకు తీసింది. అందులోని పెట్రోల్ ను లక్ష్మీతులసిపై చల్లింది. లక్ష్మీతులసి వెంటనే తేరుకోవడంతో ప్రమాదం తప్పిందని సిబ్బంది చెబుతున్నారు.

అధికారిణిపై సూపర్ వైజర్ పెట్రోల్ తో దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో లక్ష్మీతులసి భయాందోళనకు గురయ్యారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. జీతం కట్ చేసినందుకే తనపై అన్నామణి దాడి చేసిందని ఆమె అంటోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. జీతం కట్ చేసిందనే కోపంతోనే ఈ దాడి జరిగిందా? లేక మరో కారణమా? అని ఎంక్వైరీ చేస్తున్నారు.

See Also | సీఎం జగన్ ఫొటో కింద పెట్టారని, పంచాయతీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం