లాక్ డౌన్ పాస్ తీసుకుని వివాహేతర సంబంధం : షాక్ కు గురైన భార్య

కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ తో చాలా మంది ఇళ్ళకే  పరిమితమయ్యారు.  ఈ లాక్ డౌన్ వేళ ఇంట్లో భార్యా భర్తల మధ్య చిరాకులు ఎక్కువయ్యాయి. మహిళలపై గృహ హింస కేసులు గతంలో కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.  కొన్ని రంగాలకు  ప్రభుత్వం మినహాయింపు ఇవ్వటంతో పాసులు తీసుకున్న ఆయా రంగాల  ఉద్యోగస్తులు తమ తమ విధులకు హాజరవుతున్నారు.  ఇదే అదనుగా భావించిన ఒక చిరుద్యోగి లాక్ డౌన్ కారణంగా తీసుకున్న పాస్ తో…ఇంటికి వెళ్లకుండా  వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. విషయం తెలిసి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ కూకట్ పల్లి చెందిన సురేష్ (పేరు మార్చాము) అనే వ్యక్తి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.  లాక్ డౌన్ సమయంలో ఫార్మా స్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వటంతో వెహికల్ పాస్ తీసుకుని విధులకు హాజరవుతున్నాడు. ఉదయం ఇంటినుంచి బయలు దేరిన  రమేష్ ఆఫీసుకు వెళ్తున్నాడు.రాత్రికి ఆఫీసు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లక…. మూడు రోజులకోసారి ఇంటికి వెళుతున్నాడు.

భర్త రోజు ఇంటికి రాకపోయే సరికి కంగారు పడిన భార్య…  రోజు ఇంటికి రావట్లేదు ఏంటని అమాయకంగా భర్తను ప్రశ్నించింది. పాస్ ఉన్నప్పటికి కొందరు పోలీసులు రోడ్డుపైకి రావటానికి అనుమతించటం లేదని చెప్పాడు. వెహికల్ తీసుకుని సీజ్ చేస్తామన్నారని పోలీసులపై ఆరోపణలు చేశాడు. అప్పటికి ఉరుకున్న అతని భార్య రెండు రోజుల తర్వాత  భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చి తెలిసిన వారి ద్వారా భర్త గురించి  ఆరా తీసింది. విషయం తెలిసి షాక్ కు గురైంది.

తన భర్త అదే ప్రాంతంలో ఉన్న మరోక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రతి రోజు ఆఫీసు ముగించుకున్నాక  నేరుగా ఇంటికి రాకుండా ఆమె వద్దకు వెళ్లి ఉంటున్నాడు. ఒక రోజు ఇంటికి వచ్చిన భర్తను నిలదీసింది.  సైబరాబాద్ షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇలాంటి  వ్యవహారం ఆందోళన కలిగిస్తోందని ఆమె పోలీసుల ముందు తన బాధను చెప్పుకుంది.

దీంతో  పోలీసులు రమేష్ కు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు.  వెహికల్ పాస్ ను దుర్వినియోగం చేయవద్దని….లాక్ డౌన్ నిబంధనలు  ఉల్లంఘించి ఇతరుల ఇళ్ళకు వెళ్ళి భార్యా, పిల్లల ప్రాణాలు రిస్క్ లో పెట్టవద్దని …అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాస్ లో ఇచ్చిన రూల్స్  ప్రకారం ప్రతిరోజు ఆఫీసు అయిన తర్వాత ఇంటికి వెళ్లక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.