పాపిలాన్ (ఫింగర్ ప్రింట్ డివైస్).. విధానం నేరస్తుల పాలిట సింహస్వప్నంలా మారింది. దీని ద్వారా పోలీసులు క్లిష్టమైన నేరాల్లో నిందితులను సులువుగా గుర్తించేందుకు
పాపిలాన్ (ఫింగర్ ప్రింట్ డివైస్).. విధానం నేరస్తుల పాలిట సింహస్వప్నంలా మారింది. దీని ద్వారా పోలీసులు క్లిష్టమైన నేరాల్లో నిందితులను సులువుగా గుర్తించేందుకు ఉపయోగపడుతోంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి ఘటనలు జరిగినప్పుడు ఘటనాస్థలిలో దొరికే వేలిముద్రల ఆధారంగా అతి కొద్ది గంటల వ్యవధిలోనే కేసును ఛేదించేందుకు అధికారులకు ఉపకరిస్తోంది పాపిలాన్.
పాపిలాన్ అంటే.. ఆటోమేటిక్ ఫింగర్ ఫ్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఇప్పుడీ డివైజ్ నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దొంగతనాలు, హత్యలు, దోపిడీలు వంటి ఘటనా స్థలాల్లో లభించిన వేలి, అరచేతి ముద్రల ఆధారంగా నిందితులను ఇట్టే గుర్తిస్తోంది పాపిలాన్.
తాజాగా పాపిలాన్ ద్వారా పోలీసులు సక్సెస్ సాధించారు. పాపిలాన్… దొంగను పట్టించింది. 11 ఏళ్ల తర్వాత బంగారం చోరీ కేసులో నిందితురాలిని పోలీసులు పట్టుకోగలిగారు. వివరాల్లోకి వెళితే.. 2008లో దోమలగూడకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో ముంబైకి చెందిన జ్యోతి అనే మహిళ 19 తులాల బంగారు నగలు, వెండి, నగదు చోరీ చేసి పారిపోయింది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోంది.
ఇటీవల మల్కాజిగిరి పోలీసులు పాత నేరస్తుల వేలిముద్రలను పరిశీలిస్తుండగా జ్యోతి వేలిముద్రలు దోమలగూడ చోరీ కేసులో వేలిముద్రలతో సరిపోయాయి. దీంతో పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరం ఒప్పుకుంది. ఆమె నుంచి 3 తులాల బంగారు ఆభరణాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచారు.
2017లో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పాపిలాన్-ఏఎఫ్‌ఐఎస్(ఆటోమేటెడ్ ఫింగర్ అండ్ పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) ప్రపంచస్థాయి సాంకేతికతతో తెలంగాణ పోలీసులకు బాగా ఉపయోగపడుతోంది. క్రిమినల్స్ ను పట్టుకోవడంలో పాపిలాన్ కీలకంగా మారింది. అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్ మాత్రమే వినియోగించే ఈ టెక్నాలజీ మన పోలీసులూ ఉపయోగిస్తున్నారు.
దొంగతనాలు, దోపిడీలు జరిగిన స్థలాల్లో సేకరించిన వేలి ముద్రలను విశ్లేషించి అది ఎవరు చేశారో గుర్తించి క్షణాల్లో పోలీసులకు చెబుతుంది పాపిలాన్. అనుమానితుల నేరచరిత్ర మొత్తం 5 నుంచి 10 సెకన్లలో అధికారి ట్యాబ్లెట్ పీసీ మీద ప్రత్యక్షం అవుతుంది. దీంతో క్రిమినల్స్ ను పట్టుకోవడం ఈజీ అయిపోయింది.