ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విషం తాగి చనిపోయినట్లు క్లూస్ టీమ్ ఆనవాళ్లు గుర్తించింది.
ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మారుతీరావు రూమ్ లో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి, వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించింది. విషం తాగి చనిపోయినట్లు ఆనవాళ్లు గుర్తించింది. మారుతీరావు సెల్ ఫోన్, అమృతకు సంబంధించిన డాక్యుమెంట్లు ప్రణయ్ హత్య కేసు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం (మార్చి 8, 2020) ఉదయం 8 గంటల ప్రాంతంలో రూమ్ నెంబర్ 306లో ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్ లో మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కొద్దిసేపటి క్రితమే ఆర్యవైశ్య భవన్ కు చేరుకున్న క్లూస్ టీమ్ సూసైడ్ తీరుపై రూమ్ లో ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. అయితే రూమ్ లో సూసైడ్ కు సంబంధించి ఎలాంటి పాయిజన్ బాటిల్స్ దొరకలేదు. కేవలం మారుతీరావు పాయిజన్ తీసుకున్నట్లు కొన్ని ఆనవాళ్లు సేకరించారు. మారుతీరావుకు సంబంధించిన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, అందులోని కాల్ డేటా సేకరించారు. మరోవైపు అమృత ఆస్పత్రికి సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూమ్ లో మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులు, క్లూస్ టీమ్ సేకరించారు. ఆ రిపోర్టు మొత్తాన్ని సైన్స్ అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
లాయర్‌ను కలిసేందుకు మారుతీరావు నిన్న తన డ్రైవర్‌తో కలసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సాయంత్రం 6.40కి డ్రైవర్‌తో కలిసి ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన మారుతీరావు.. రెండ్రోజుల కోసం రూమ్ బుక్ చేసుకున్నాడు. 306 గదిలో బసచేశాడు. ఏడున్నరకు డ్రైవర్‌ను పిలిపించిన మారుతీరావు గారెలు తినాలనిపిస్తుందని… తీసుకురమ్మని పంపాడు. రేపు ఉదయం లాయర్ దగ్గరకు వెళ్లాలి 8గంటలకల్లా రూమ్‌కు రమ్మని డ్రైవర్‌కు చెప్పాడు. అతడిని కారులోనే పడుకోమని చెప్పి 5వందల రూపాయలు కూడా ఇచ్చాడు. కాసేపటి తర్వాత వైట్‌పేపర్ తెప్పించుకున్నాడు.
ఆ తర్వాత తన భార్యతో ఫోన్‌లో మాట్లాడి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆదివారం ఉదయం ఏడున్నరకి మారుతీరావు కోసం గదికి వెళ్లిన డ్రైవర్… డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే సమయంలో మారుతీరావు భార్య తన భర్తకు ఫోన్ చేసింది. అతడి ఫోన్ కలవకపోవడంతో డ్రైవర్‌కు కాల్ చేసింది. దీంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బంది సాయంతో పోలీసులకు ఫోన్ చేశారు. వారు తలుపులను పగలగొట్టేసరికి మారుతీరావు శవమై కనిపించాడు.
మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన సైఫాబాద్ పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు మారుతీరావు రాసిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేను చనిపోయాక నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో అని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు మారుతీరావు. మరోవైపు… మారుతీరావు చనిపోయిన తీరుపై క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తోంది.
దీనికి సంబంధించి అనుమానాస్పద మృతిగా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పాయిజన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు…చనిపోయే ముందు నిన్న ఎక్కడెక్కడ తిరిగాడన్న దానిపై పోలీసులు పూర్తి ఆరా తీస్తున్నారు. మారుతీరావు చనిపోయిన తీరు చూసినట్లైతే రూమ్ లో వాంతులు చేసుకున్న తీరు, రూమ్ లో కొన్ని ఆనవాళ్లు చూసినట్లైతే కేవలం పాయిజన్ తీసుకుని చనిపోయినట్లు పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం పూర్తి అయిన నేపథ్యంలో ప్రైమరీ రిపోర్టు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.