PubG కోసం ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ విద్యార్ధి

  • Publish Date - March 12, 2019 / 03:39 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆన్‌లైన్ గేమ్ PubGకి  ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ గేమ్‌కు చాలామంది అడిక్ట్ అయిపోయారు. ఈ గేమ్ వల్ల ఇప్పటికే అనేక ప్రతికూల ఘటనలు బయటకు రాగా తాజాగా మరో విషయం ఆ గేమ్ ఆడే యువత, పిల్లల తల్లిదండ్రులను టెన్షన్ పెడుతుంది. PubG గేమ్ ఆడవద్దు.. చదువుకో అని మందలించినందుకు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన శేషత్వం సాయిచరణ్(18) అనే డిగ్రీ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే… మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శేషత్వం వెంకటనారాయణ ప్రజ్ఞాఫూర్‌లో ఉంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్న వెంకటనారాయణ చిన్న కొడుకు సాయిచరణ్ గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో డిగ్రీ చదివేవాడు.
అయితే గతకొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్ PubGకి బానిసై చదువును నిర్లక్షం చేస్తున్నాడు. దీంతో PubG గేమ్ ఆడవద్దని చెప్పినా వినకపోవడంతో.. తల్లి శారద గట్టిగా మందలించింది. తల్లి మందలింపుకు తీవ్ర మనస్థాపానికి గురై సాయిచరణ్ పక్క గదిలోకి ఉరేసుకొని చనిపోయాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి చూడగా.. సాయిచరణ్ ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించాడు.

తలుపులు తెరిచి చూసే సరికి అప్పటికే సాయిచరణ్ చనిపోయి ఉన్నాడు. గేమ్ ఆడడం అనేది చిన్న విషయమే అయినా గేమ్ కోసం ప్రాణాలు తీసుకోవడం అంత పెద్ద విషయంగా మారడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ గేమ్ వల్ల ఆలోచించే జ్ఞానం కూడా తగ్గి యువత గేమ్‌లోనే ఉండిపోతున్నారని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.