శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడికి పధక రచన చేసిన ప్రధాన సూత్రధారి ఎలక్ట్రీషియన్ మహ్మద్ భాయ్ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. త్రాల్‌లోని పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. సోదాలు జరుపుతుండగా ఒక ఇంట్లో దాక్కోని ఉన్న దుండగులు భద్రతా దళాలపై కాల్పులు జరిపాయి. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు, వారి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ముక్కలయ్యాయి. మరణించిన వారిలో జైషే మహ్మద్ ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ హతమై ఉంటాడని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పుల్వామా దాడికి సంబంధించి ఇంతవరకు జరిపిన దర్యాప్తులో మహ్మద్ భాయ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. త్రాల్‌లోని మిర్ మొహల్లా ప్రాంతానికి చెందిన అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తిచేసి, ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌గా డిప్లొమా కోర్సు చేశాడు. పుల్వామా దాడికి పేలుడు పదార్థాలను, వాహనాన్ని ఏర్పాటుచేసింది అహ్మద్ ఖానే. అతివాద భావజాలానికి ఆకర్షితుడై 2017లో జైషే మహ్మద్‌లో చేరాడు. మొదట గ్రౌండ్ వర్కర్‌గా పనిచేసిన అహ్మద్ ఖాన్,. 2018 నుంచి క్రియాశీలకంగా పని చేస్తూ వచ్చాడు. పుల్వామా ఉగ్రదాడిలో ఆత్మాహుతి చేసుకున్న అదిల్ అహ్మద్ దార్ , దాడికి ముందు ఖాన్‌తో చాలా రోజుల పాటు చర్చలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు.