భాగ్యనగరంలో ఘరానా మాయగాళ్లు.. ప్రభుత్వ ఉద్యోగాలు, స్కీముల పేరిట 108 మందికి మోసం

ప్రభుత్వం మాదే.. మేము ఎంత చెబితే అంత. కానీ ఒక్కో దానికి ఓక్కో రేట్. మమ్మల్ని క్యాష్‌తో సంతృప్తి పరచండి.. మిమ్మల్ని ఉద్యోగాలు, పోస్టింగ్లు, స్కీంలతో సంతోష పెడతాం. అంటూ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా..?

నీకు ఏం జాబ్ కావాలి.. నీకు ఎక్కడ పోస్టింగ్ ఇప్పించాలి. నీకు ఏ ప్రభుత్వ స్కీం అమలు చేయాలి. ప్రభుత్వం మాదే.. మేము ఎంత చెబితే అంత. కానీ ఒక్కో దానికి ఓక్కో రేట్. మమ్మల్ని క్యాష్‌తో సంతృప్తి పరచండి.. మిమ్మల్ని ఉద్యోగాలు, పోస్టింగ్లు, స్కీంలతో సంతోష పెడతాం. అంటూ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా..? అయితే అస్సలు నమ్మకండి.. మాయగాళ్ల వలలో పడకండి.. మేము చెప్పినా వినరా.. అయితే ఈ స్టోరీ చూసి.. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి.

ప్రభుత్వ స్కీములు, ఉద్యోగాలు, బదిలీల పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు చెక్ పెట్టారు. ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తుల పేర్లు చెబుతూ మోసాలు చేసిన ఆరుగురు నిందితులు సురేందర్ రెడ్డి, మెరీనా రోస్, అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్, హర్షిని రెడ్డిలను అరెస్ట్ చేశారు.

కుషాయిగూడకు చెందిన అనుగు సురేందర్ రెడ్డి గురుకుల సెక్రటరీ వర్షిణికి ఫోన్ చేశాడు. వేం నరేందర్ రెడ్డిగా పరిచయం చేసుకుని ట్రాన్స్ఫర్లు చేయాలని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. అయితే నిందితుడి మోసాన్ని పసిగట్టిన ఐఏఎస్ అధికారిణి వర్షిణి.. విషయం పోలీసులకు తెలపడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది.

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరుతో అనుగు సురేంద్ రెడ్డి ఫోన్లో మాట్లాడి విద్యాశాఖలో పోస్టింగ్లు, అమాయక ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఫుడ్ కార్పొరేషన్లో జాబ్లు, నచ్చిన చోటకు ట్రాన్స్ఫర్లు చేపిస్తానని చెప్పి మోసాలకి పాల్పడుతున్నాడు. అనుగు సురేందర్ రెడ్డితో పాటు మెరీనా రోస్, అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్, హర్షిని రెడ్డిలు జాబ్లు ఇప్పిస్తానని జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురి నుంచి 98 నకిలీ డబుల్ బెడ్రూమ్స్ కేటాయింపు పత్రాలు, కీసర RDO స్టాంప్లు, లక్షా 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మాయగాళ్ల బాధితుల్లో ఏడుగురు విద్యాశాఖ అధికారులు ఉన్నారన్నారు. జనాల నుంచి కోట్లలో వసూలు చేసిన ఈ డబ్బునంతా ముఠా క్రికెట్ బెట్టింగ్లో పెడుతోందన్నారు. ప్రధాన నిందితుడు సురేందర్ రెడ్డిపై గతంలోనే కేసులు ఉన్నాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. 2021 సంవత్సరంలో క్రికెట్ బెట్టింగ్ కేసులో నేరెడ్‌మెట్ పీఎస్‌లో సురేందర్ రెడ్డి A1 గా అరెస్ట్ అయ్యాడని తెలిపారు.

ఈ కేటుగాళ్లు.. 98 మందిని డబుల్ బెడ్ రూమ్ పేరుతో బురిడీ కొట్టించారు. ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు పేరుతో ఏడుగురుకి టోకరా వేశారు. ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తామని ఇద్దరి నుంచి ఈ గ్యాంగ్ డబ్బులు వసూలు చేసింది. మొత్తంగా 108 మందిని పలు విధాలుగా మోసం చేసి.. కోటీ 29 లక్షలు వసూలు చేసింది. ఒక్క చర్లపల్లి పరిధిలోనే 98 మందిని మోసం చేశారంటే వీళ్లు జనాలను ఎంతలా మాయ చేశారో అర్థం చేసుకోవచ్చు.

Also Read: దొంగలకే కోచింగ్ ఇచ్చే గజదొంగ.. తిరగని ఏరియా, చూడని జైలు లేదు!

చూశారుగా..ప్రభుత్వ ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు, స్కీంలు పేరిట ఈ మాయగాళ్లు ఎంతమందిని మోసం చేశారో.. ఇలాంటి వారి మాయలో పడి.. మోసపోవద్దని పోలీసులు కోరుతున్నారు. ఎవరైనా ప్రభుత్వ పెద్దలమంటూ ఫోన్లు చేసినా, డబ్బులు ఇస్తే ఉద్యోగాలు, స్కీములు వర్తింప చేస్తామని చెప్పినా.. తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు