శబరిమల కేసు: రేపు మహిళల పిటీషన్ విచారించనున్న సుప్రీం

శబరిమల లో అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు తమకు రక్షణ కల్పించమని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించనుంది

  • Publish Date - January 17, 2019 / 01:30 PM IST

శబరిమల లో అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు తమకు రక్షణ కల్పించమని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించనుంది

ఢిల్లీ: 24 గంటలు తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ, జనవరి 2న శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు దాఖలు చేసిన పిటీషన్ను  సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించినందుకు హిందూ సంస్ధల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందు అమ్మిని  సుప్రీం లో పిటీషన్ దాఖలు చేసారు. అయ్యప్ప దర్శనానంతరం వారు రాష్ట్ర ప్రభుత్వ రక్షణలో  కొచి లోని ఒక రహస్య స్ధావరంలో తల దాచుకున్నారు. కన్నూర్‌ జిల్లాకు చెందిన వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడాన్ని ఒప్పుకోని హిందూ సంఘాలకు చెందిన నిరసనకారులు అడ్డుకున్నారు. అయ్యప్ప ఆలయంలోకి తమను అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ వీరు నిరవధిక దీక్షకు దిగడం కలకలం రేపింది.
 కాగా … శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం  గత మంగళవారం తన అత్తగారింటికి వచ్చిన కనకదుర్గ పై ఆమె అత్త ఆగ్రహిస్తూ కర్రతో దాడి చేసింది.  ఈ దాడిలో తలకు బలమైన  గాయం ఐన కనకదుర్గ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై ఐపీసీ సెక్షన్‌ 341, 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన  తర్వాత కొంత మంది మహిళలు  ఆలయం లోకి వెళ్లటానికి ప్రయత్నంచగా ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడిన సంగతి విదితమే. కాగా అయ్యప్ప ఆలయంలోకి ఇరువురు మహిళలు దుర్గ, బిందులు ప్రవేశించడంతో ఆలయ ప్రధాన పూజారి ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేయడం  కూడా వివాదాస్పదమైంది. దేవస్ధానం ఈ అంశంపై ప్రధాన పూజారి వివరణ కూడా తీసుకుంది.