దిశ నిందితుల ఎన్ కౌంటర్ : సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ

  • Publish Date - December 11, 2019 / 08:04 AM IST

సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్ కౌంటర్ పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్న కోర్టు.. ఢిల్లీ నుంచే రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారంది. అలాగే ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో కేసు కొనసాగుతుందని తెలిపింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం(డిసెంబర్ 11,2019) విచారణ జరిపింది. తదుపరి విచారణను గురువారానికి(డిసెంబర్ 12,2019) వాయిదా వేసింది. ఈ కేసులో ఎలాంటి వాదనలు జరగకుండానే రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం విశేషం.

న్యాయమూర్తుల పేర్లతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. అయితే తమ వాదనలు విన్న తర్వాత ముందుకు వెళ్లాలని తెలంగాణ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ను వ్యతిరేకిస్తూ.. జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు.

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు.

శుక్రవారం(డిసెంబర్ 6,2019) తెల్లవారుజామున దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు నలుగురు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ తమపై దాడి చేసి తుపాకులు లాక్కుని పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామని, ఆ కాల్పుల్లో నలుగురూ మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు. నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

దిశ హత్యాచారం నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే పలు మహిళా సంఘాలు ఎన్‌కౌంటర్ ను వ్యతిరేకించాయి. చట్ట ప్రకారం వెళ్లి వారిని శిక్షించి ఉండాలని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. ఎన్ కౌంటర్ పై దర్యాఫ్తు చేపట్టింది. నిజాలు తెలుసుకునే పనిలో ఉంది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను ఎన్ హెచ్ ఆర్ సీ విచారించింది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇద్దరే ఆయుధాలు లాక్కుంటే.. నలుగురినీ ఎందుకు చంపారు? పారిపోతుంటే పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇలా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై కేసులు కూడా నమోదయ్యాయి.