కీర్తి రెడ్డి కేసులో మూడో పాత్ర : తల్లిని చంపిన కేసులో కీలక పరిణామాలు

  • Publish Date - October 30, 2019 / 01:42 PM IST

తల్లిని చంపిన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కీర్తిరెడ్డి కేసులో మూడో పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రైల్వేట్రాక్ వరకు తీసుకువెళ్లేందుకు, బాల్‌రెడ్డి సహకరించారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తల్లిని హత్య చేసిన తర్వాత మూడు రోజుల పాటు బాల్‌రెడ్డి ఇంట్లోనే కీర్తి రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. కీర్తి రెడ్డి, శశి, బాల్ రెడ్డి వాట్సప్ చాటింగ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా విచారిస్తున్నారు. 

హత్య తర్వాత తల్లి రజిత సెల్‌ఫోన్‌ను తీసుకువెళ్లిన కీర్తి.. పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే సెల్‌ఫోన్‌ను మళ్లీ ఇంట్లో పడేసిందని తెలుస్తోంది. సెల్‌ఫోన్ లోకేషన్ల ఆధారంగా ఎవరి పాత్ర ఏమిటన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. హత్య జరిగిన ఇంట్లో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో వీరికి ఎవరు సహకరించారన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. కీర్తి రెడ్డి ప్రేమ వ్యవహారం, తర్వాత జరిగిన పరిణామాలు శశి తండ్రికి ముందే తెలిసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

అక్టోబర్ 19వ తేదీన హయత్ నగర్‌లోని మునగనూరు గ్రామంలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన అందర్నీ దిగ్ర్భాంతికి గురి చేసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమ పేరిట భవిష్యత్ నాశనం చేసుకోవద్దని తల్లి రజిత చెప్పడమే నేరమైంది. ఈ నెల 19న ప్రియుడు శశిని ఇంటికి రప్పించుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన రజిత..కూతురు కీర్తిని నిలదీసింది. దీంతో ఆమెను అంతమొందించాలని పథకం వేశారు. రజితను అడ్డు తొలగిస్తే కీర్తిని పెళ్లి చేసుకోవచ్చని, ఆస్తి దక్కించుకోవచ్చని శశి ప్లాన్ వేశాడని పోలీసులు భావిస్తున్నారు. 

మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని ప్రియుడితో రాసలీలలు సాగించింది. శవం దుర్వాసన రావడంతో అర్ధరాత్రి వేళ కారులో తీసుకెళ్లి యాదాద్రి జిల్లా రామన్నపేట సమీపంలోని తుమ్మలగూడెం వద్ద రైల్వేట్రాక్‌పై పడేశారు. తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి రాగా..భార్య రజిత కనిపించకపోవడంతో కీర్తిని నిలదీశాడు. ఆమెపై అనుమానం వచ్చిన తండ్రి గట్టిగా నిలదీశాడు. దీంతో తన తండ్రి తాగొచ్చి రోజూ కొట్టడం వల్లే తల్లి ఎక్కడికో వెళ్లిపోయిందని హయత్‌నగర్ పోలీసులకు కీర్తి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగుచూసింది.
Read More : ఆర్టీసీ సమ్మె 26వ రోజు : సకల జనుల సమరభేరి..తరలివస్తున్న కార్మికులు