ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసిన నిందితుడి ఊహా చిత్రాన్ని మదనపల్లి పోలీసులు
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసిన నిందితుడి ఊహా చిత్రాన్ని మదనపల్లి పోలీసులు విడుదల చేశారు. చేనేత నగర్‌లో ఉన్న కల్యాణ మండపంలో బుధవారం(నవంబర్ 6,2019) రాత్రి జరిగిన ఓ పెళ్లికి చిన్నారి వర్షిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో శుక్రవారం(నవంబర్ 8,2019) ఉదయం చిన్నారి మృతదేహం లభ్యమైంది. పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం లభించింది.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వర్షిత హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కల్యాణ మండపంలో సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించగా.. చిన్నారిని ఓ వ్యక్తి మండపం వెనక మరుగుదొడ్ల వైపు తీసుకెళ్లినట్లుగా ఉంది. 15 నిమిషాల తర్వాత అతనొక్కడే తిరిగి మండపంలోకి వచ్చి బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. దీన్ని బట్టి అతనే చిన్నారిని హత్య చేసి ఉంటాడని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కల్యాణమండపంలో తిరుగాడిన హంతకుడి ఆనవాళ్లను సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు అతన్ని కర్ణాటకవాసిగా గుర్తించారు. దీంతో అతని సమాచారం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, కోలార్, కేజీఎఫ్ జిల్లాల్లోని డీసీఆర్ బీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడిని పట్టుకోవడానికి మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కల్యాణమండపం వాచ్‌మెన్ చెప్పిన ఆనవాళ్లను బట్టి నిందితుడి ఊహ చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపాలని పోలీసులు కోరారు.
మరోవైపు.. వర్షిత హత్యపై పోలీసులు పోస్టుమార్టం నివేదిక వివరాలను వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఊపిరాడకుండా చేశాడని, దానివల్లనే వర్షిత మరణించిందని పోలీసులు చెప్పారు. ఆరేళ్ల చిన్నారిని పాశవికంగా పొట్టనబెట్టుకున్న ఘటనపై ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.