పెద్దపల్లి జిల్లా విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి తాతతోపాటు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సిద్దార్థ, ఆదర్శ్, జిత్తు అనే పిల్లలు వేసవి సెలవుల్లో ఓదెల మండలం కొలనూర్ లో ఉంటున్న తాత కస్తూరి రాజయ్య దగ్గరకు వెళ్లారు. అయితే ముగ్గురు మనవళ్లు ఈత నెర్పించమని తాతను అడిగారు.
శుక్రవారం (మే4, 2019) నలుగురు కలిసి కొలనూర్ లోని చెరువు దగ్గరకు ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ముగ్గురు పిల్లలు చెరువులో పడిపోయారు. పిల్లలకు ఈత రాకపోవడంతో పూర్తిగా నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు తాత రాజయ్య నీటిలోకి దిగాడు. ఆయన అనారోగ్యంగా ఉన్నాడు. దీంతో ముగ్గురు పిల్లలతోపాటు రాజయ్య కూడా మృతి చెందారు.
జాలర్లు అర్ధరాత్రి వరకు గాలించి సిద్దార్థ, రాజయ్య మృతదేహాలను వెలికితీశారు. ఇవాళ ఆదర్శ్, జిత్తు మృతదేహాలను వెలికి తీశారు. నలుగురి మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవలే మిషన్ కాకతీయలో భాగంగా చెరువులో పూడిక తీశారు. చెరువులోని గుంతల లోతు వీరికి తెలియకపోవడం, ఈత రాకపోవడం, రాజయ్య అనారోగ్యంగా ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.