రైతు చేసిన పని కరెక్ట్ కాదు : తహశీల్దార్ హత్యను ఖండించిన మంత్రి సబిత

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహశీల్దార్ హత్యను మంత్రి ఖండించారు.

  • Publish Date - November 4, 2019 / 10:51 AM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహశీల్దార్ హత్యను మంత్రి ఖండించారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహశీల్దార్ హత్యను మంత్రి ఖండించారు. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో వేధించినందుకే హత్య చేశానని నిందితుడు రైతు సురేష్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ.. ఇలాంటి ఘోరాలకు తెగబడకూడదని మంత్రి అన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను మంత్రి సబిత ఆదేశించారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీపీ మహేష్ భగవత్ లు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు, తహశీల్దార్ ఆఫీస్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ లో విజయ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం(నవంబర్ 4,2019) ఉదయం విజయ ఆఫీస్ కి వచ్చారు. తన సీటులో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం 1.20గంటల ప్రాంతంలో సురేష్ ఆఫీస్ లోకి వచ్చాడు. తహశీల్దార్ తో మాట్లాడాలని చాంబర్ లోనికి వెళ్లాడు. ఇద్దరూ అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా లోపలి నుంచి కేకలు వినిపించాయి. తహశీల్దార్ విజయ మంటల్లో తగలబడిపోతున్నారు. ఆమె అరుచుకుంటూ బయటకు వచ్చారు. ఇద్దరు సిబ్బంది ఆమెని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. తీవ్ర గాయాలు కావడంతో విజయ స్పాట్ లోనే చనిపోయారు. ఆమెని కాపాడే ప్రయత్నంలో సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సమయంలో.. సురేష్ కి కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరూ మంటల్లో చిక్కుకోవడంతో… సురేష్ తన చొక్కా విప్పేశాడు. ఆ తర్వాత తలుపులు తీసి బయటకు పరుగులు పెట్టాడు. ఈ ఘటనలో సురేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. విజయారెడ్డి హత్య తర్వాత నిందితుడు సురేష్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో విజయారెడ్డి తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని, తనను వేధించారని రైతు సురేష్ ఆరోపించాడు. అందుకే విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగలబెట్టానని పోలీసుల విచారణలో అంగీకరించాడు.