తెలంగాణలో దేవుడి మాన్యాలకు దిక్కూమొక్కూ లేకుండా పోతోంది.
హైదరాబాద్ : తెలంగాణలో దేవుడి మాన్యాలకు దిక్కూమొక్కూ లేకుండా పోతోంది. వందల కోట్ల రూపాయల విలువచేసే వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైనా.. పట్టించుకునే నాథులు లేరు. ఆగమశాస్త్రయుక్తంగా పూజలు, కైంకర్యాల నివేదనకు దేవాలయాలకు దాతలు ఇచ్చిన భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని హారతి కర్పూరం లాగా హరించుకుపోతున్నాయి. దేవాలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాల కోసం దాతలు ఇచ్చిన భూములకు రక్షణ కరువైంది. గతంలో దేవాలయ ఆధీనంలో ఉన్న భూములను 1969లో దేవాదాయ శాఖ కిందకు తీసుకొచ్చారు. దాతలు, అర్చకులు ఈ భూములను పరక్షించేవారు. దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చిన తర్వాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్యాక్రాంతమయ్యాయి.
తెలంగాణలో దేవాలయాలకు దాతలు భారీగా భూములు ఇచ్చారు. మొత్తం 85 వేల ఎకరాలు ఉంటే దాదాపు 35 వేల ఎకరాల భూములు అన్యాక్రాంత మయ్యాయంటే కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. జంటనగరాల్లో దాదాపు పది వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. దేవుని మాన్యాలు ఎక్కువగా రియల్టర్లు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాన్న ఆరోపణలు ఉన్నాయి. హుండీ ఆదాయం, టెండర్లు, ప్రసాదాల విక్రయాలపై దృష్టి పెట్టే దేవాదాయ శాఖ అధికారులు… దేవుని మాన్యాల పరిరక్షణపై శ్రద్ధ పెట్టలేదు. చాలా భూములకు సరైన రికార్డులు కూడా లేవు. ఇదే అదునుగా భావించిన కొందరు అధికారులు… రియల్టర్లతో చేతులు కలిపి కొన్ని భూములు దేవాలయ మాన్యాలు కావంటూ నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు ఇచ్చేశారు.
దేవాలయాల భూములకు సర్వే నిర్వహించి అన్యాక్రాంతమైన మాన్యాలను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ, దేవాదాయ, పోలీసు అధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోపోవడాన్ని అర్చక సంఘాలు తప్పుపడుతున్నాయి. దేవాలయ భూముల రికార్డు ప్రక్షాళనచేసి, మాన్యాలకు దేవునిపేరుమీద పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నారు. దేవుని మాన్యాలను పరిరక్షించుకోపోతే భవిష్యత్‌లో దేవాలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాలు కరువయ్యే ప్రమాదం ఉందన్నఆందోళన వ్యక్తమవుతోంది.