Jagtial ATM Theft : జగిత్యాల జిల్లా కోరుట్లలో దొంగలు రెచ్చిపోయారు. పక్కా స్కెచ్ తో కోరుట్లలోని ఏటీఎంలో చోరీ చేశారు. భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ముందుగా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం ముందు కాసేపు తిరిగి లోపలికి వెళ్లిన ఇద్దరు దొంగలు.. ముందుగా లోపల ఉన్న సీసీ కెమెరాలను బ్లాక్ చేసి దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీస్ వెహికల్ సైరన్ మోగడంతో దొంగలు భయంతో పారిపోయారు.
అనంతరం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కోరుట్ల పట్టణంలోని ఏటీఎంలో చోరీ చేశారు. ఏటీఎం పగలగొట్టి సుమారు 19లక్షల రూపాయలు దోచుకెళ్లారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా వాటికి అడ్డుగా వస్తువులు పెట్టారు. వెంటనే అలర్ట్ అయిన పెట్రోలింగ్ పోలీసులు నగదుతో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోరుట్ల ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు డబ్బు కొట్టేసి పారిపోతుండగా.. సినీ ఫక్కీలో పోలీసులు అడ్డుకున్నారు. చోరీ విషయం హైదరాబాద్‌లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి సిగ్నల్ రావడంతో.. వెంటనే కోరుట్ల పోలీసులను అలర్ట్ చేశారు. తక్షణం స్పందించిన పోలీసులు.. పెట్రోలింగ్ వాహనంతో అక్కడికి చేరుకున్నారు. కారులో పారిపోతున్న దుండగులను అడ్డుకున్నారు. పోలీసులను చూసిన దొంగలు కంగారుపడ్డారు. ఈ క్రమంలో కొంత నగదు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయింది. ఆ డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.