Hyderabad Chain Snatching : హైదరాబాద్‌లో మళ్లీ చైన్ స్నాచింగ్ కలకలం.. ఎల్బీనగర్‌లో గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దొంగ, ఎలా కొట్టేశాడో చూడండి
హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. ఇటీవలే ఒక్కరోజే గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు మరువక ముందే.. మరో చోరీ జరిగింది. ఈసారి ఎల్బీనగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది.

Hyderabad Chain Snatching : హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. పోలీసులు నిఘా పెంచినా.. చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలే ఒక్కరోజే 2 గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన ఘటన మరువక ముందే.. మరో చోరీ జరిగింది. ఈసారి ఎల్బీనగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది.
కాకతీయ కాలనీలో మహిళ మెడ నుంచి ఓ దుండగుడు చైన్ లాక్కెళ్లాడు. మహిళ నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన దుండగుడు బైక్ ను పక్కన నిలిపాడు. ఆమె వెనుక నుంచి వెళ్లి ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బైక్ పై వచ్చిన అతడు, చోరీ చేశాక బైక్ పై
పారిపోయాడు. బాధితురాలు అతడి వెనుకే పరిగెత్తినా ప్రయోజనం లేకపోయింది. స్నాచర్ వేగంగా అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..Hyderabad : హైదరాబాద్ చైన్ స్నాచర్ల ఆగడాలు.. దొంగల కోసం 20 పోలీసు బృందాలు గాలింపు
బైక్ పై వచ్చిన దొంగ.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఫాలో అయ్యాడు. కొంత దూరం పాటు అలాగే ఫాలో అయ్యాడు. ఓ ప్రాంతంలో రోడ్డు పై ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగ.. బైక్ ను రోడ్డు పక్కన ఆపాడు. మహిళ వెనుకే నడుచుకుంటూ వెళ్లిన దొంగ.. రెప్పపాటులో ఆమె మెడలోని బంగారు గొలుసు తెంపేశాడు. ఆ తర్వాత తన బైక్ పై పారిపోయాడు. బాధితురాలు తేరుకునేలోపే గొలుసు దొంగ ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటన మరోసారి నగరంలో కలకలం రేపింది. పోలీసులు నిఘా పెంచినా.. చైన్ స్నాచింగ్ లు జరుగుతుండటం నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది.
కాగా.. జంట నగరాల్లో వరుస చైన్ స్నాచింగ్ లు కలకలం రేపుతున్నాయి. నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో మళ్లీ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. గొలుసులు తెంచుకెళ్లారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, పటిష్టమైన నిఘా, సిటీ పోలీసుల కఠిన చర్యలతో హైదరాబాద్ అంటేనే హడలెత్తిన ముఠాలు ఏడాది తర్వాత మరోమారు రెచ్చిపోయాయి. చైన్ స్నాచర్ గ్యాంగ్ లు మళ్లీ సిటీపై కన్నేశాయి. నగరవాసులు ఉలిక్కిపడేలా చైన్ స్నాచర్లు బరితెగించారు. రెండు గంటల వ్యవధిలోనే 6 చోట్ల మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు చైన్ స్నాచర్లు.
స్నాచర్స్ రెచ్చిపోవడంతో హైదరాబాద్ లో నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. స్నాచర్స్ కోసం ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దింపారు. గొలుసు దొంగల కోసం వేట ప్రారంభించారు. అయితే, నిఘా పెంచామని పోలీసులు చెబుతున్నా.. చైన్ స్నాచింగ్ ఘటనలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైప బంగారు ఆభరణాలు ధరించినప్పుడు మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు.