దారుణం : అంత్యక్రియలకు పిలిచి డాక్టర్ హత్య.. దహనం

విశాఖపట్నంలో దారుణం జరిగింది. గ్రామస్తులు ఓ నాటు వైద్యుడిని కొట్టి చంపారు. ఆ తర్వాత దహనం కూడా చేశారు. రోగి చనిపోవడానికి నాటు వైద్యుడే కారణం అనే అనుమానంతో

  • Publish Date - October 21, 2019 / 12:34 PM IST

విశాఖపట్నంలో దారుణం జరిగింది. గ్రామస్తులు ఓ నాటు వైద్యుడిని కొట్టి చంపారు. ఆ తర్వాత దహనం కూడా చేశారు. రోగి చనిపోవడానికి నాటు వైద్యుడే కారణం అనే అనుమానంతో

విశాఖ ఏజెన్సీలో దారుణం జరిగింది. కుటుంబసభ్యులు ఓ నాటు వైద్యుడిని కొట్టి చంపారు. ఆ తర్వాత గుట్టు చప్పుడుకాకుండా దహనం కూడా చేశారు. రోగి చనిపోవడానికి నాటు వైద్యుడే కారణం అనే అనుమానంతో ఈ ఘోరానికి పాల్పడ్డారు.

జి.మాడుగుల మండలంలోని సొలభం పంచాయతీ కూనేటి గ్రామానికి చెందిన చిక్కుడు జగ్గారావు నాటు వైద్యం చేస్తుంటాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు అనారోగ్యానికి గురైనా జగ్గారావునే ఆశ్రయిస్తారు. సేరుబయలు గ్రామానికి చెందిన మర్రి ముసిరి అనారోగ్యానికి గురికావడంతో అతనికి వైద్యం అందించాడు. కానీ పరిస్థితి విషమించి అక్టోబర్ 18న ముసిరి మృతి చెందాడు. ఇందుకు నాటు వైద్యుడు జగ్గారావే కారణమని మృతుడి సోదరుడు దేముడు భావించాడు. అతనిపై కక్ష పెంచుకుని అదే రోజు మధ్యాహ్నం జగ్గారావు ఇంటికి వెళ్లాడు.
 
తన సోదరుడు చనిపోయాడని, అంత్యక్రియలకు రావాలని కోరాడు. దీంతో నాటు వైద్యుడు తన కుమారుడు రవితో కలిసి సేరుబయలు వెళ్లాడు. అప్పటికే కోసం రగిలిపోతున్న దేముడు, అతని కుమారులు భాస్కరరావు, సుబ్బారావు, ఇతరులు డాక్టర్ పై దాడి చేశారు. ఇటుకలతో తలపై కొట్టారు. తీవ్ర రక్తస్రావమైన డాక్టర్ కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనను చూసి జగ్గారావు కొడుకు రవి ప్రాణభయంతో పారిపోయాడు. సొంతూరుకు వచ్చి విషయాన్ని గ్రామస్తులకు వివరించాడు. 

శనివారం కూనేటి గ్రామస్తులు సేరుబయలు వెళ్లారు. నాటు వైద్యుడు జగ్గారావు గురించి అడిగారు. అతడు చనిపోయాడని, మృతదేహాన్ని దహనం చేశామని దేముడు చెప్పారు. దీంతో వారు షాక్ తిన్నారు. వెంటనే మృతుడి కొడుకు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో నాటు వైద్యుడిని కొట్టి చంపిన ఘటన సంచలనం రేపింది.