జయరాం కేసులో మళ్లీ అందరినీ విచారిస్తాం : వెస్ట్ జోన్ డీసీపీ 

  • Publish Date - February 8, 2019 / 10:46 AM IST

హైదరాబాద్: పారిశ్రామికవేత్త  చిగురుపాటి జయరాం హత్యకేసులో దర్యాప్తు మొదలైందని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తామని,  ఈ కేసులో ఆరోపణలు  ఎదుర్కోంటున్న పోలీసు అధికారులను కూడా విచారిస్తామని ఆయన తెలిపారు. జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఫిబ్రవరి 7న నందిగామ పోలీసు స్టేషన్ నుంచి కేసు ట్రాన్సఫర్ అయినందున, కేసును రీ-రిజిష్టర్ చేసి విచారణ ప్రారంభించామని ఆయన తెలిపారు.  

నందిగామ పోలీసులు అరెస్టు చేసిన రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను పీటీ వారంట్ మీద హైదరాబాద్ తీసుకువస్తామని ఆయన చెప్పారు. కేసులో నందిగామ పోలీసులు విచారణ జరిపిన వ్యక్తులను కూడా తిరిగి విచారిస్తామని, హత్య హైదరాబాద్ లో జరిగింది కనుక ఇక్కడ విచారించాల్సిన వాళ్లు కూడా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. జయరాం భార్య పద్మశ్రీ పేర్కొన్న అనుమానితులను కూడా విచారిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఏపీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిందే కాకుండా, కేసులో కూలంకషంగా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామని డీసీపీ శ్రీనివాస్ వివరించారు.