’పంచాయతీ’ గొడవ ప్రాణం తీసింది : వివాహిత ఆత్మహత్య

సర్పంచ్ గా పోటీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

  • Publish Date - January 13, 2019 / 09:52 AM IST

సర్పంచ్ గా పోటీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

నల్గొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలు గొడవ మహిళ ప్రాణం తీసింది. సర్పంచ్ గా పోటీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది.

డిండి మండలం నిజాంనగర్‌కు చెందిన భైరాపురం మీనయ్య-శారద దంపతుల కుమార్తె రాధ(22)ను అదే మండలం ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగమయ్యకు ఇచ్చి 8 నెలల కిందట వివాహం చేశారు. పెళ్లి సమయంలో ఒప్పుకున్న ద్విచక్ర వాహనం కోసం రాధను భర్త లింగమయ్య తరచూ వేధింపులకు గురిచేసే వాడు. 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎర్రగుంటపల్లి సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో సర్పంచ్ గా పోటీ చేయాలంటూ రాధను ఆమె భర్త ఒత్తిడి చేయడమే కాకుండా రూ.5 లక్షలు తీసుకురావాలని వేధిస్తున్నాడు.  ఆమె ఈ నెల 6న నిజాంనగర్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వేధింపుల విషయాన్ని వివరించినా ఫలితం లేకుండాపోయింది. బుధవారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాధను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.