ఉత్తరాఖండ్ లోని ఓ యూనివర్శిటీలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే వక్రమార్గం పట్టారు. అర్థరాత్రి విద్యార్థినికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. విద్యార్థిని ఎన్నిసార్లు వీసీకి కంప్లెయింట్ చేసినా పట్టించుకోకపోవడంతో చివరికి ఈ విషయం ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గరకు వెళ్లింది.
జీబీ పంత్ యూనివర్శిటీ హాస్టల్ వార్డెన్ కూడా అయిన ప్రొఫెసర్ తనకు అర్దరాత్రి ఫోన్ చేసి…ప్రస్థుతం నా భార్య ఇంట్లో లేదు, ఎవరు నాకు వంట చేసి పెడతారు..నువ్వు రా మా ఇంటికి అంటూ కోరారని ఓ విద్యార్థిని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్‌ను డిస్ కనెక్ట్ చేస్తే, ఫ్రొఫెసరు తనకు టెక్ట్స్ మెసేజ్ లు కూడా పంపించారని దాన్ని సాక్ష్యంగా వీసీకి విద్యార్థిని సమర్పించిన ఫిర్యాదుతోపాటు జత చేశారు. దీంతోపాటు ప్రొఫెసరు తనకు అర్దరాత్రి తరచూ ఫోన్ కాల్స్ చేశాడని విద్యార్థిని వీసీకి సమర్పించిన ఫిర్యాదులో తెలిపారు.
తాను ప్రొఫెసర్పై ఫిర్యాదు చేసినా, అతనిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని విద్యార్థిని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారం కాస్తా రాజ్ భవన్ కు చేరింది. గవర్నర్ బేబి రాణి మౌర్యా దృష్టికి ఈ విషయం రావడంతో ఆమె దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యుడైన ప్రొఫెసరుపై కఠిన చర్యలు తీసుకోవాలని వీసీని ఆదేశించారు. గవర్నరు ఆదేశాల ప్రకారం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వర్శిటీ ప్రొఫెసరును వార్డెన్ పోస్టు నుంచి ఇప్పటికే తొలగించామని పంత్ విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఏపీ శర్మ చెప్పారు. యూనివర్శిటీ విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని రిజిష్ట్రార్ తెలిపారు.