Anantapur Police: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో సురేష్ బాబు దారుణ హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ హత్య కేసును 6 గంటల్లో ఛేదించారు పోలీసులు. నిన్న రాత్రి సురేష్ బాబు దారుణ హత్యకు గురయ్యాడు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు జిల్లా ఎస్పీ. ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సురేష్ బాబును మర్డర్ చేయించింది అతడి భార్యే అని పోలీసులు తేల్చారు.
వివాహేతర సంబంధానికి అడ్డు ఉండకూడదనే భర్త సురేష్ బాబును భార్య అనిత హత్య చేయించినట్లు తెలిపారు. అనితకు ఫకృద్దీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన భర్త హత్యకు ప్రియుడని ఉసిగొల్పింది భార్య అనిత. హత్య కేసు వివరాలను రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
”గత రాత్రి బండిపై వెళ్తున్న సురేష్ బాబుపై ఫకృద్దీన్ ఖాళీ సీసాతో దాడి చేశాడు. తర్వాత స్క్రూడ్రైవర్ తో పొడిచాడు. ఆ తర్వాత బండరాయితో బాది హత్య చేశాడు. ప్రియుడు ఫకృద్దీన్, సురేష్ బాబు భార్య అనితను అరెస్ట్ చేశాం” అని పోలీసులు తెలిపారు. ”రెండు నెలల క్రితం అనితకు పండ్లు అమ్ముకునే బాబా ఫకృద్దీన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త సురేష్ కు అనుమానం వచ్చి భార్య అనితను పలుమార్లు మందలించాడు. దీంతో భర్తను చంపేయాలని భార్య అనిత నిర్ణయించుకుంది. తన భర్తను చంపితేనే మనం సంతోషంగా ఉంటామని ప్రియుడిని ఉసిగొల్పింది. దీంతో నిన్న రాత్రి ఇంటికి వెళ్తున్న సురేష్ ను ఫక్రుద్దీన్ అడ్డుకున్నాడు. బండరాయితో కొట్టి అత్యంత దారుణంగా అతడిని హతమార్చాడు” అని పోలీసులు వెల్లడించారు.
Also Read: చదివేది టెన్త్ క్లాస్.. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది.. అదే సమయంలో చెల్లి రావడంతో..
కంబదూరు ప్రాంతానికి చెందిన సురేష్ ఆరేళ్లుగా అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి పరిధిలోని సదాశివ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కంపల్లి సమీపంలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు సురేష్. ఎప్పటిలాగే హోటల్ ముగించుకుని మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని చేధించారు.
ప్రియుడి మోజులో వివాహితలు చేస్తున్న దారుణాలు, నేరాలు, ఘోరాలు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రియుడి కోసం కట్టుకున్న మొగుడిని కూడా కడతేరుస్తున్నారు. పక్కాగా ప్లాన్ చేసి మరీ భర్తలను భార్యలే లేపేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులో ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి మరీ అత్యంత కిరాతకంగా చంపించింది ఓ భార్య. ఇది మరువకు ముందే.. గద్వాల్ లో దారుణం జరిగింది. పెళ్లైన నెల రోజులకే భర్తను చంపించింది భార్య. ప్రియుడి మోజులో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. తాజాగా అనంతపురం రూరల్ రాచానపల్లిలోనూ అదే తరహా క్రైమ్ జరిగింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తలను భార్యలే చంపిస్తున్న వైనం కలవరానికి గురి చేస్తోంది.