దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా యూపీలో మహిళల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని యోగి సర్కర్ ప్రకటనలు చేస్తున్నప్పటికీ మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగుతున్నాయి తప్ప ఆగడం లేదు. ఇటీవల ఉన్నావోలో ఓ అత్యాచార బాధితురాలపై పెట్రోల్ పోసి తుగులబెట్టిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్నావో ఘటన కన్నా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటావు అంటూ ఓ నిందితుడు ఓ అత్యాచార బాధితురాలిని లేఖ ద్వారా బెదిరించడం కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ కు చెందిన ఓ మహిళపై గతేడాది ఢిల్లీలోని ముఖర్జీనగర్ లో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై గత జులైలో బాధిత మహిళ ఢిల్లీ పోలీసులకు కంప్లెయింట్ చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బుధవారం(డిసెంబర్-11,2019)బెయిల్ పై నిందితుడు విడుదలయ్యాడు. ఇదే సమయంలో భాగ్ పట్ లోని బాధిత మహిళ ఇంటి గోడకి అంటించిన ఓ లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
శుక్రవారం ఢిల్లీ కోర్టులో నువ్వు స్టేట్మెంట్ ఇవ్వకూడదు.ఇచ్చావంటే ఉన్నావో మహిళలకు మొన్న జరిగిన దానికంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ ఆ పాంప్లేట్ లో బాధిత మహిళను హెచ్చరిస్తూ రాసి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు బెయిల్ పై బయట ఉన్న నిందితుడిని మరోసారి అరెస్ట్ చేశారు. బాధిత మహిళకు భద్రత కల్పించామని,ఆమె భద్రతకు ఎలాంటి ఢోకా లేదని భాగ్ పట్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ప్రతాప్ గోపేందర్ యాదవ్ తెలిపారు.