ఇంకెంతమంది బలి అవ్వాలి : అధికారపార్టీ నిర్లక్ష్యానికి మరో యువతి మృతి

తమిళనాడులో దారుణం జరిగింది. ఇటీవల చెన్నైలో బైక్ వెళ్తున్న శుభశ్రీ అనే యువతి అధికార పార్టీ హోర్డింగ్ పైన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే కోయంబత్తూరులో మరొకటి జరిగింది. అధికార అన్నాడీఎంకే పార్టీ జెండా పోల్ కారణంగా 30ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.

కోయంబత్తూరుకి చెందిన అనురాధ రాజేశ్వరి(30)సోమవారం ఉదయం ఇంటి నుంచి ఆఫీస్ కు స్కూటర్ పై బయల్దేరింది. కోయంబత్తూరు హైవేపై ఆమె బైక్ పై వెళ్తున్న సమయంలోఅధికార పార్టీకి చెందిన ఓ ఫ్లాగ్ పోల్ రోడ్డుపై పడి ఉండటంతో దాని పక్కగుండా వెళ్తున్న సమయంలో స్పీడ్ గా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టడంతో అనురాధకి తీవ్ర గాయాలయ్యాయి. లారీ టైర్లు  పైగా వెళ్లడంతో ఆమె కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయని పోలీసులు తెలిపారు. అదే సమయంలో బైక్ పై వెళ్తున్న మరో వ్యక్తిని కూడా లారీ ఢీ కొట్టిందని తెలిపారు. అయితే తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం ఉదయం ఆమె మరణించినట్లు సమాచారం.

సీఎం పళనిస్వామికి స్వాగతం చెబుతూ ఏఐడీఎంకే నాయకులు అవినాశి హైవేపై హోర్డిండ్ పెట్టారని,అయితే పోలీసులు దాన్ని కవర్ చేస్తున్నారంటూ బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భద్రతా విషయాల దృష్ట్యా రోడ్లపై ఎలాంటి పొలిటికల్ హోర్డింగ్ లు పెట్టకూడదని ఇటీవల మద్రాస్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.