వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరుతో ఘరానా మోసం.. 19 లక్షలు పోగొట్టుకున్న మహిళ

ఆ వ్యక్తులు చెప్పిన విధంగా మరింత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఈసారి పెద్ద మొత్తంలో వారికి డబ్బు చెల్లించింది.

మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరుతో మోసాలు పెరిగిపోయాయి. ఇంట్లో ఉండే మహిళలే టార్గెట్ గా కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరుతో అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా మరో ఘరానా మోసం వెలుగు చూసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరుతో ఢిల్లీకి చెందిన మహిళను చీట్ చేశారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి 19లక్షలు దోచేశారు.

ఢిల్లీకి చెందిన ఓ మహిళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమెకు ఓ ప్రకటన కనిపించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తామని అందులో ఉంది. దీంతో ఆమె వెంటనే వారిని కాంటాక్ట్ అయ్యింది. వారు చెప్పిన విధంగా టెలిగ్రామ్ గ్రూపులో చేరింది. తొలుత 5వేలు కట్టింది. ఆ తర్వాత ఆమెకు కొన్ని టాస్క్ లు ఇచ్చారు. ఆ మహిళ వాటిని పూర్తి చేసింది. ఆ వెంటనే ఆమె బ్యాంకు ఖాతాలోకి 5వేల 600 రూపాయలు పడ్డాయి.

దీంతో ఆమెకు నమ్మకం కుదిరింది. ఆ వ్యక్తులు చెప్పిన విధంగా మరింత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఈసారి పెద్ద మొత్తంలో వారికి డబ్బు చెల్లించింది. కొంత డబ్బుని స్నేహితుల దగ్గర అప్పుగా తీసుకుంది. లోన్ రూపంలో మరికొంత నగదు తీసుకుంది. అలా లక్షల్లో డబ్బు కట్టింది. అయితే, ఇచ్చిన టాస్క్ లన్నీ పూర్తి చేస్తేనే డబ్బులు విత్ డ్రా చేయడానికి అవకాశం ఉంటుందని వాళ్లు చెప్పారు. దీంతో ఆమె టాస్క్ లన్నీ పూర్తి చేసింది. తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని అడిగింది. అయితే, ఆ డబ్బ విత్ డ్రా చేయాలంటే మరో 14లక్షలు చెల్లించాలని ఆ వ్యక్తులు చెప్పారు. దీంతో ఆ మహిళ కంగుతింది. ఆమెకు అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

వర్క్ ఫ్రమ్ జాబ్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దన్నారు. పూర్తి వివరాలు ఏవీ తెలుసుకోకుండా డబ్బులు చెల్లించడం వంటివి చేయొదన్నారు. అలాగే వ్యక్తిగత సమాచారం కూడా వారి చేతిలో పెట్టడం ప్రమాదకరం అని హెచ్చరించారు.

Also Read : మీ రూ.500 నోటు ఒరిజనలేనా? హైదరాబాద్‌లో దొంగ నోట్ల కలకలం, భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

ట్రెండింగ్ వార్తలు