Car Accident : బావిలోకి దూసుకెళ్లిన కారు.. వెలికితీయబోయి గజ ఈతగాడు మృతి

సిద్దిపేట జిల్లాలోని చిట్టాపూర్‌లో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. బావిలోని కారును బయటకు వెలికితీసేందుకు వెళ్లిన గజ ఈతగాడు మృతిచెందాడు.

Swimmer Narasimhulu (2)

Car Accident : సిద్దిపేట జిల్లాలోని చిట్టాపూర్‌లో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. బావిలోని కారును బయటకు వెలికితీసేందుకు వెళ్లిన గజ ఈతగాడు మృతిచెందాడు. కారులో ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. దాదాపు పది మంది గజ ఈతగాళ్లు కారును బయటకు తీసేందుకు బావిలోకి దిగారు. అయితే కారుకు తాడుకట్టి బయటకు లాగే క్రమంలో ఇనగుర్తి గ్రామానికి చెందిన గజ ఈతగాడు నర్సింహులు మృతిచెందాడు. తాడు బిగించిన కారులో చిక్కుకుపోయి ఊపిరి ఆడక బావిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

గజ ఈతగాళ్లు కారును బయటకు తీసేందుకు 8 గంటల పాటు శ్రమించారు. కానీ, సాయంగా వచ్చిన గత ఈతగాడు నర్సింహులు మృతిచెందడంతో ఇనగుర్తి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద టైరు పేలడంతో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. గజఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. బావిలోని కారును వెలికితీసేందుకు ప్రయత్నించారు. రెండు మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించారు.

కొంతమేర నీళ్లను ఖాళీ చేసిన తర్వాత బావిలోని కారును బయటకు తీసేందుకు ప్రయత్నించారు గజ ఈతగాళ్లు. బావి లోపల ఉన్న నర్సింహులు తాడును కారుకు బిగించాడు. పైకి వచ్చే సమయంలో చిక్కుకుపోయి నీటిలోనే మృతిచెందాడు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలను పరిశీలించారు.