దేశవ్యాప్తంగా 2014–15లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అమ్మాయిల్లో కేవలం 8 శాతం మందికే ఐఐటీల్లో సీట్లు లభించాయి. 2015–16లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 4,600 మంది అమ్మాయిలు అర్హత సాధిస్తే అందులో 850 మందికే సీట్లు వచ్చాయి. 2016–17 విద్యా సంవత్సరంలోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. 2017–18 ప్రవేశాల లెక్కల ప్రకారం ఐఐటీల్లో 9.15 శాతం మంది అమ్మాయిలకే సీట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్య పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
IITలో ఈసారి అమ్మాయిలకు 17 శాతం సీట్లను కేటాయించేందుకు ఐఐటీ కౌన్సిల్ ప్రయత్నం చేస్తోంది. గతేడాది సూపర్ న్యూమరరీ కింద 779 సీట్లను పెంచి అమ్మాయిల ప్రవేశాలను 15.3 శాతానికి చేర్చిన IIT కౌన్సిల్ ఈసారి కనీసం 17 శాతం దాటేలా చూడాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సీట్ల పెంపునకు చర్యలు చేపట్టింది.
2017–18 విద్యా సంవత్సరంలో IITలో చేరిన అమ్మాయిల సంఖ్య 9.15 శాతమే ఉండటంతో దానిని 2020–21 విద్యా సంవత్సరానికి నాటికి కనీసం 20 శాతానికి పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD) గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018–19 విద్యాసంవత్సరం ప్రవేశాల్లో 14 శాతం సీట్లను కేటాయిస్తామని ప్రకటించింది.
ప్రవేశాల కౌన్సెలింగ్‌లో రెగ్యులర్‌గా సీట్లు లభించిన వారు కాకుండా అదనంగా 779 మంది అమ్మాయిలకు ప్రత్యేక సీట్లను కేటాయించింది. దీంతో ఆ విద్యాసంవత్సరంలో ఐఐటీల్లో చేరిన అమ్మాయిల సంఖ్య 1,840కి చేరింది. దాంతో ఈసారి (2019–20) విద్యా సంవత్సరం 17 శాతం సీట్లను పెంచేందుకు ఐఐటీల కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తోంది.