పిల్లలూ విన్నారా : 8వ తరగతి వరకు హిందీ చదవాల్సిందే

  • Publish Date - January 10, 2019 / 07:51 AM IST

ఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎనిమిదో తరగతి వరకూ హిందీ భాషను తప్పనిసరి చేయాలని కె.కస్తూరి రంగన్‌ కమిటీ తయారు చేసిన ముసాయిదా నివేదిక సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై గతంలో ప్రభుత్వం తొమ్మిది మంది నిపుణులతో కూడిన సభ్యులతో ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమిటీ ముసాయిదా నివేదికలో కీలక సూచనలు చేసింది. ఆంగ్లం, హిందీ సహా ప్రాంతీయ భాషతో కలిపి మొత్తం మూడు సబ్జెక్టులు అమలు చేయడానికి రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని కమిటీ సూచించింది. సైన్స్, మాథమెటిక్స్ వంటి సబ్జెక్టులకు ఏకరూప సిలబస్‌ ఉండొచ్చని సూచించింది.

తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గోవా, పశ్చిమ్‌ బంగ, అసోం వంటి రాష్ట్రాల్లో హిందీ తప్పనిసరి అనే నిబంధన లేదు. కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ నిబంధనను అనుసరిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో నాలుగు లేదా ఐదు తరగతుల నుంచి హిందీ సబ్జెక్టు ప్రవేశపెట్టే విధానం ఉంది. దేశమంతా ఒకే తరహాలో, శాస్త్రీయ కోణంలో విద్యార్థులు విషయాన్ని నేర్చుకొనే లక్ష్యంతోనే ఎన్‌ఈపీలో మార్పులు తీసుకొస్తున్నట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. అవాధీ, భోజ్‌పురీ, మైథిలీ వంటి కొన్ని ప్రాంతీయ భాషల్లో ఐదో తరగతి వరకూ సిలబస్‌ను ఈ కమిటీ అభివృద్ధి చేస్తోంది.

కస్తూరి రంగన్‌ కమిటీ తయారు చేసిన నివేదిక ఇప్పటికే మానవ వనరుల శాఖకు చేరిందని, సభ్యులు తనను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. ఎన్‌ఈపీ 2020 నుంచి 2040 తరం కోసం ఉద్దేశించిన విధానపరమైన నివేదిక అని జావడేకర్‌ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.