ఇంగ్లిష్ భాష పై మరింత నైపుణ్యం సాధించేందుకు ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) సరికొత్త యాప్ ను రూపొందించింది. ‘ఇంగ్లిష్ ప్రో’ పేరుతో రూపొందించిన ఈ యాప్ అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ ను తయారుచేసినట్లు ఇఫ్లూ వైస్ చాన్స్లర్ ఈ సురేష్ కుమార్ శుక్రవారం (మే 10,2019)న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి వివరించారు.
ఈ సందర్భంగా ఇఫ్లూ చేపట్టిన కార్యాక్రమాల గురించి వివరిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనా పద్ధతులు మెరుగుపడటం, ఉత్తమ ఫలితాలు రావాలంటే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం అవసరమని తెలిపారు. దీనిలో భాగంగా త్వరలో ఖైరతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబులిటీ (యూ ఎస్ ఆర్) కింద శిక్షణ తరగతి నిర్వహిస్తామని గవర్నర్ కు వివరించారు.
దేశంలోనే యూ ఎస్ ఆర్ కింద ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారని అయన పేర్కొన్నారు. యూ ఎస్ ఆర్ భాగంగా ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, రష్యన్, జర్మనీ, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, అరబిక్ , జపనీస్, కొరియన్, చైనీస్, పర్షియన్ భాషల్లో ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్‌ను తమ యూనివర్శిటీ సిద్ధం చేసిందని, వీటిని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 30 గంటల్లో ఆయా భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించుకునే వీలుందని అన్నారు. దీనిని ఉచితంగా అందిస్తామని చెప్పారు. అంతేగాక ఇంగ్లీష్ ప్రో పేరుతో ఒక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేశామని, ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.