హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్–2019 ప్రవేశపరీక్ష దరఖాస్తులను ఈ నెల 28 నుంచి స్వీకరించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. నోటి ఫికేషన్ ఫిబ్రవరి 25 న విడుదల చేసి, మే 31న పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సెట్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఫిబ్రవరి 28 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తుది గడువు ఏప్రిల్ 10 వరకు ఉంటుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో (https://edcet. tsche.ac.in) దరఖాస్తు చేసుకోవచ్చని పాపిరెడ్డి తెలిపారు.
మే 31న పరీక్ష నిర్వహించి, జూన్ 15న ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజును రూ.650గా కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు రూ.450 చెల్లించాలని, రూ.500 ఆలస్య రుసుముతో విద్యార్థులు ఏప్రిల్ 20 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు కమిటీ నిర్ణయించింది.
రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష
ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షను మే 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రాంతీయ కేంద్రాలుగా రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కోదాడ, ఆదిలాబాద్.. ఏపీలోని విజయవాడ, కర్నూలును ఎంపిక చేసారు. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎస్.రామచంద్రం, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, ఎడ్‌సెట్ కన్వీనర్ మృణాళిని తదితరులు పాల్గొన్నారు.