JEE Advanced Results 2026 : జేఈఈ ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 5 లో నిలిచిన ఒకే ఒక తెలుగు విద్యార్థి.. ఎవరంటే..
JEE Advanced Results 2026 : జేఈఈ 2026 పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఆ వివరాలు..
jee advanced 2026 results out shubham kumar bags all india 1st rank students from telugu states details here
- జేఈఈ 2026 ఫలితాలు విడుదల
- టాప్ 3 ర్యాంకులన్నీ ఢిల్లీ జోన్ విధ్యార్థులకే
- టాప్ 5లో ఒకే ఒక్క తెలుగు విద్యార్థి
JEE Advanced Results 2026 : దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీలలో చేరాలని భావించే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం జేఈఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావించే ఈ ఎగ్జామ్‌లో ఈసారి ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. కామన్ ర్యాంక్ లిస్ట్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌ను ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ కైవసం చేసుకుని.. జేఈఈ పరీక్షలో దేశంలోనే టాపర్‌గా నిలిచారు. మొత్తం 360 మార్కులకు గాను శుభమ్ కుమార్ ఏకంగా 330 మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.
టాప్ 5 లో నిలిచిన తెలుగు విద్యార్థి సందీప్
నేడు వెల్లడించిన జేఈఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థి ఒకరు టాప్ 5 లో నిలిచారు. విశాఖపట్నం నారాయణ కాలేజీకి చెందిన సందీప్ అనే విద్యార్థి జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఏకైక తెలుగు విద్యార్థిగా సందీప్ రికార్డు క్రియేట్ చేశారు.
టాప్ 3 ర్యాంకులు ఢిల్లీ జోన్ సొంతం
ఈ సంవత్సరం జేఈఈ టాప్ ర్యాంకుల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ క్లీన్ స్వీప్ చేసింది. జేఈఈ ఫలితాల్లో దేశంలోనే టాప్ 3 ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులు కూడా ఢిల్లీ జోన్ నుంచే కావడం విశేషం. వీరిలో శుభమ్ కుమార్ అనే విద్యార్థి 330 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా.. అదే జోన్‌కు చెందిన కబీర్ చిల్లర్ కేవలం ఒక్క మార్కు తేడాతో ఫస్ట్ ర్యాంక్ కోల్పోయి.. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. అలాగే 319 మార్కులతో జతిన్ చాహర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్‌ను తన సొంతం చేసుకున్నారు.
మహిళా టాపర్‌గా ఆరోహి దేశ్‌పాండే
ఇక మహిళా అభ్యర్థుల విషయానికి వస్తే.. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన ఆరోహి దేశ్‌పాండే దేశంలోనే అత్యధిక ర్యాంకు సాధించిన మహిళగా నిలిచారు. మొత్తం 360 మార్కులకు గాను ఆరోహి 280 మార్కులు సాధించి.. ఆల్ ఇండియా 77వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.
56,880 మంది అర్హత
ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,87,389 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి అప్లై చేసుకున్నారు. వారిలో 1,79,694 మంది విద్యార్థులు ఈ ఏడాది మే 17న నిర్వహించిన పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశానికి మొత్తం 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విజయం సాధించిన వారిలో 10,107 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం.
