నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం (జనవరి 13, 2020)న JEE మెయిన్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ ని విడుదల చేసింది. దాంతోపాటుగా క్వశ్చన్ పేపర్లను కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే జనవరి 15 లోగా విద్యార్థులు తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది.
ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు ప్రాసెసింగ్ ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు లేనిదే ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించరు. ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అయితే అభ్యంతరం సరైనది అని తేలితే అభ్యర్థులకు ఫీజును తిరిగి చెల్లిస్తారు.
అభ్యర్ధులకు జనవరి 6న పరీక్షలు పరీక్షలు ప్రారంభంకాగా.. మొదటిరోజు పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. ఇక జనవరి 7, 8, 9 తేదీల్లో పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. మొదటి పరీక్ష ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు, రెండో పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించారు.
ఫలితాలు ఎప్పుడంటే?
పరీక్ష ఫలితాలను షెడ్యూలు ప్రకారం జనవరి 31న విడుదల చేయాల్సి ఉండగా.. జనవరి 20లోపే ఫలితాలను వెల్లడించే అవకాశమున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా తెలిసింది. గతేడాది తొలి సెషన్ పరీక్షలు జనవరి 12తో ముగియగా.. జనవరి 19న పర్సంటైల్ ప్రకటించారు. అంటే వారంరోజుల్లో విద్యార్థుల మార్కులను ప్రకటించారు. ఈ ప్రకారం ఈ ఏడాది కూడా ఇదే విధంగా ఫలితాలు వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండో విడత ఏప్రిల్ లో ఉంటుంది. పరీక్షల అనంతరం JEE మెయిన్ ర్యాంలకును వెల్లడించనున్నారు.