×
Ad

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గెట్‌ రెడీ.. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు!

కాంగ్రెస్ సర్కారు ఏర్పడి డిసెంబరులో రెండేళ్లు పూర్తవుతుంది. ఆలోగా నోటిఫికేషన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. దాదాపు 25,000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.

Telangana Jobs

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ఇకపై వరుసగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసుకుంటోంది. టీజీపీఎస్సీతో పాటు పలు రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఇదే పనిలో ఉన్నాయి. పోస్టుల ఖాళీలపై ఆయా శాఖల నుంచి వివరాలు తీసుకుంటున్నాయి.

గ్రూప్1 కింద 563 పోస్టులకు ఎంపికైన వారికి ఇటీవలే అపాయింట్మెంట్ ఆర్డర్లు అందాయి. అలాగే, 783 గ్రూప్-2 సెలక్షన్ లిస్టును కూడా విడుదల చేశారు. వారికి కూడా నియామక పత్రాలు త్వరలోనే అందనున్నాయి.

ఇక, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షెడ్యూల్ వచ్చేసింది. ఈ నియామక ప్రక్రియను కూడా ఈ నెల​లోపే పూర్తిచేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఆ తర్వాత కొత్త ఉద్యోగాల భర్తీపై కసరత్తు చేయనుంది. ఈ మేరకు అగ్రికల్చర్, విద్యా శాఖ నుంచి వివరాలు కూడా తీసుకుంది. అంతేకాదు, కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల సమాచారాన్ని కూడా సేకరించింది.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి డిసెంబరులో రెండేళ్లు పూర్తవుతుంది. దీంతో ఆలోగా నోటిఫికేషన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. దాదాపు 25,000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.

పోలీస్ శాఖలోనే 17,000 ఖాళీలు ఉన్నాయి. అలాగే, గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. విద్య, వ్యవసాయ, విద్యుత్తు, వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. గ్రూప్ 1, 2, 3, 4కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.