TG PGECET 2026 : అలర్ట్.. పీజీఈసెట్ 2026 పరీక్ష వాయిదా.. కారణమిదే.. కొత్త తేదీ ఎప్పుడంటే..
TG PGECET 2026 : తెలంగాణ పీజీఈసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
- Dharani Pilli
- Updated on- May 20, 2026 / 02:18 PM IST
TG PGECET 2026 exam on may 28 postponed to June 1 due to Bakrid holiday hall ticket to be released on 22
TG PGECET 2026 : తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు సర్కార్ కీలక అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ పీజీఈసెట్ పరీక్ష 2026 (TG PGECET)ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి హైదరాబాద్ జేఎన్‌టీయూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బక్రీద్ పండగ నేపథ్యంలో పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్‌లో కీలక మార్పు చోటుచేసుకుంటున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి అయితే.. ముందుగా ప్రకటించిన మేరకు చూసుకుంటే.. మే 28వ తేదీన తెలంగాణ పీజీఈసెట్ పరీక్ష నిర్వహించాలి. కానీ ఇప్పుడు దీన్ని జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
అలానే పరీక్ష సమయం, హాల్‌టికెట్ల విడుదల వంటి విషయాల గురించి కూడా అభ్యర్థులు దిగులు చెందుతున్నారు. మిగతా రోజుల్లో నిర్వహించే పరీక్షలను కూడా వాయిదా వేశారా ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. కేవలం, మే 28వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను మాత్రమే వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ పరీక్షను జూన్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అలానే మిగిలిన పరీక్షలన్నీ కూడా ముందుగా ప్రకటించిన తేదీల్లోనే అంటే.. మే 29, 30, 31వ తేదీల్లోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ పీజీఈసెట్ పరీక్ష
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, ఫార్మసీ, సివిల్ వంటి తదితర పీజీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సంవత్సరం పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా పరీక్ష షెడ్యూల్‌లో చోటు చేసుకున్న ఈ మార్పులను గమనించాలని కన్వీనర్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు.
మే 28 నాటి పరీక్షను మాత్రమే జూన్ 1కి మార్చారు. మిగిలిన తేదీల పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అలానే పరీక్షల టైమింగ్స్‌లో కూడా ఎలాంటి మార్పు ఉండదని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఉదయం సెషన్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు యథావిధిగా జరుగుతుంది.
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 22, 2026న ఉదయం 11 గంటల నుండి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కౌన్సిల్ ప్రకటించింది. దాని మీద ఉన్న పరీక్ష తేదీ, కేంద్రం, సమయం వివరాలను హాల్‌టికెట్‌లో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించింది.
