TTD Sculpture College : పది పాసైన విద్యార్థులకు శుభవార్త.. ఈ కాలేజీలో సీటొస్తే ఉచిత విద్యం+భోజనం.. జాబ్ సాధించేలా శిక్షణ
TTD Sculpture College : పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త.. ఈ కాలేజీలో సీటు వస్తే 4 ఏళ్ల పాటు ఉచితంగా విద్య, హస్టల్, భోజన వసతి కల్పిస్తారు.
TTD SV Sculpture College Admissions 2026 2027 are open to provide free hostel food and education apply before 20 june
TTD Sculpture College : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఇంటర్ కాలేజీల్లో చేరే విద్యార్థుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. చదువుతో పాటు ఉచిత వసతి కల్పించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. పదో తరగతి పాస్ అయి ఉండి శిల్పకళపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం టీటీడీ ఈ ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. వీరి కోసం టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.
ఈ కాలేజీలో ప్రధానంగా రెండు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు (ట్రెడిషనల్ స్కల్ప్చర్). ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు శిలా శిల్పం, సుధా శిల్పం, కొయ్య శిల్పం, లోహ శిల్పం, ఆలయ నిర్మాణం మరియు సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సును రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మరియు AICTE అనుమతితో నిర్వహిస్తున్నారు. రెండవది 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు అయిన సంప్రదాయ కలంకారి కళ. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు దుస్తులపై చిత్రించే సంప్రదాయ చిత్రకళలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అయితే ఈ కోర్సుకు ప్రతి సంవత్సరం సుమారు 10 మంది విద్యార్థులను మాత్రమే పరిమిత సంఖ్యలో ఎంపిక చేస్తారు.
ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి
- కనీస అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- దరఖాస్తులను మే 4 నుంచి జూన్ 20, 2026 వరకు సమర్పించవచ్చు.
- అప్లికేషన్ను కళాశాలలో నేరుగా లేదా టీటీడీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
సీట్లు, సదుపాయాలు
- ప్రతి విభాగానికి సుమారు 10 మంది చొప్పున మొత్తం సుమారు 60 మందిని ఎంపిక చేస్తారు.
- వీరికి ఉచిత హాస్టల్ మరియు భోజన సదుపాయం ఉంటుంది.
- అంతేకాకుండా విద్యార్థుల పేరిట రూ. 1 లక్ష బ్యాంకులో డిపాజిట్ చేసి, కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా అందజేస్తారు.
- చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రసిద్ధ ఆలయాల సందర్శన అవకాశం కూడా ఉంటుంది.
ఉపాధి అవకాశాలు
- టీటీడీ ఆలయ నిర్మాణ మరియు పునర్నిర్మాణ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- అలాగే పురావస్తు, దేవాదాయ మరియు పర్యాటక శాఖల్లో కూడా అవకాశాలు ఉంటాయి.
- స్థపతి, టెక్నికల్ అసిస్టెంట్ మరియు కాంట్రాక్టర్ వంటి పాత్రల్లో పని చేయవచ్చు.
- వీటితో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా విస్తారంగా ఉన్నాయి.
వెబ్ సైట్, అడ్రెస్
వెబ్సైట్: www.tirumala.org
ఫోన్: 0877-2264637
చిరునామా:
- శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ,
- అలిపిరి రోడ్,
- తిరుపతి – 517507.
