ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం (మే5, 2019) జరగనుంది. ఒడిశా మినహా దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. నీట్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 6, తెలంగాణలో 5 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 90 వేల మంది విద్యార్థులు, తెలంగాణలో 80వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో జిల్లాలో 13 నుంచి 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ జరగనుంది.
నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు కచ్చితంగా టైమ్ మేనేజ్‌మెంట్ పాటించాల్సిందే. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు…సెంటర్‌కు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఎవరు వచ్చినా….అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని…పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలు బంగారు ఆభరణాలతో రాకూడదని….రిస్ట్‌వాచ్‌లు, బ్రాస్‌లెట్లు, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, బ్లూటూత్‌ను అనుమతించరు. హాఫ్ స్లీవ్, లాంగ్ స్లీవ్ ధరించిన వారిని…బూట్లు వేసుకొచ్చిన వారిని పరీక్షకు అనుమతించబోమంటున్నారు. చివరికి మంచినీళ్ల బాటిల్‌ను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే…ముందుగానే ఇన్విజిలేటర్‌తో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
పరీక్షా కేంద్రంలో ఒకటిన్నర నుంచి 1.45 వరకు ఇన్విజిలేటర్ నిబంధనలను తెలియజేస్తారు. 1.45 నుంచి 1.50 వరకు బుక్‌లెట్‌లో అవసరమైన సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది. విద్యార్థి తన అడ్మిట్ కార్డులో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాల్సి ఉంటుంది. పరీక్షను మధ్యలోనే ముగించి వెళ్లడానికి వీలు లేదు. విద్యార్థులు నిబంధనలు పాటించకపోతే మూడేళ్లు డీబార్ చేస్తారు.
180 ప్రశ్నలతో 720 మార్కులకు నీట్ పరీక్ష జరుగుతుంది. ప్రతీ ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తెలుగు మీడియం విద్యార్థులు…మాతృభాషలో పరీక్ష రాసుకోవడానికి అవకాశం కల్పించింది సీబీఎస్‌ఈ. తెలుగు ప్రశ్నాపత్రం కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాసే విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా రాసే నీట్ ఫలితాలను మే 5, 2019న ప్రకటించనున్నారు.