దృష్టిలోపం ఉన్న వారికి త్వరలోనే ఆడియో పుస్తకాలు రానున్నాయి. కేరళ రాష్ట్రం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ లోపం ఉన్న వారు బ్రెయిలీ లిపిలో చదువుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై స్టేట్ కౌన్సిల్ ఫడ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) దృష్టి సారించింది. కేరళ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ టీచర్స్ ఫోరం సహకారంతో ‘శృతిపాదం’ పేరిట ఆడియో పుస్తకాలను రికార్డు చేయాలని నిర్ణయించింది.
పాఠశాల విద్యార్థుల సహాయంతో దీనిని పూర్తి చేయాలని యోచిస్తోంది. దృష్టిలోపం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు, SCERT ప్రతినిధులు త్వరలోనే సమావేశం కానున్నారు. మార్చి 31వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రతినిధులు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి ప్రతి జిల్లాలోని ఐదు పాఠశాలలను ఎంపిక చేస్తారు. మొత్తం 15 మంది విద్యార్థులను ఎంపిక చేసి..ఆడియో పుస్తకాలను తయారు చేస్తారు.
కనీసం 300 ఆడియో పుస్తకాలను తీసుకరావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు. 2020, జూన్ 15వ తేదీ నాటికి ఆడియో పుస్తకాలను పూర్తి చేస్తామని, కేరళ ఫెడరేషణ్ ఆఫ్ ది బ్లైండ్ వీటిని సేకరించి..విద్యార్థులకు పంపిణీ చేస్తుందన్నారు. ఒక అంచనాకు వచ్చిన తర్వాత..అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని SCERT యోచిస్తోంది.