Congress vs TMC: ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు విపక్ష పార్టీలతో కలిసి చేతులు కలిపిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు.. మరొకవైపు రాజకీయ యుద్ధంలో హోరాహోరీగా తలపడుతున్నారు. దేశంలో దోస్తీ చేస్తూనే బెంగాల్ రాష్ట్రంలో కుస్తీ పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమత బెనర్జీపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీకి అయిన గాయంపై స్పందిస్తూ ప్రజల మనసులను దోచుకోవడానికే గాయమైనట్లు నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జూలై 8న జరగనుంది. కాగా, ఈ ఎన్నికల్లో టీఎంసీ విజయం కోసం మమత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రెండు రోజులపాటు ప్రచారం చేసి, మంగళవారం తిరిగి కోల్‌కతాకు వస్తూండగా వాతావరణం అనుకూలించకపోవడంతో సిలిగురిలో హెలికాప్టర్ అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె మోకాలికి, నడుముకు గాయాలైనట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి.
Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి చర్చలో మహిళా రిజర్వేషన్లను లేవనెత్తిన శరద్ పవార్
ఆమె ప్రస్తుతం తన నివాసంలో చికిత్స పొందుతున్నారని, రెండు గంటలపాటు ఫిజియోథెరపీ చేశారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. బుధవారం ఆమె ఆరోగ్యం మెరుగయిందని, మందుల వాడకం కొనసాగించాలని డాక్టర్లు చెప్పారని తెలిపారు. అయితే ఈ ప్రకటనలపై అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను తప్పుదోవ పట్టిస్తారనే ఖ్యాతి మమత బెనర్జీకి ఉందన్నారు. గతంలో కూడా ఎన్నికల ప్రచార సమయంలో ఆమె గాయపడినట్లు వార్తలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఎన్నికలు ముగిసిపోతే, ఆమె తన కాళ్లతో తాను నడవగలుగుతారని తాను అప్పట్లో చెప్పానని, తాజా గాయం కూడా అలాంటిదేనని అధిర్ రంజన్ అన్నారు.