Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి చర్చలో మహిళా రిజర్వేషన్లను లేవనెత్తిన శరద్ పవార్
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట నడుస్తామని తేల్చి చెప్పాయి

Sharad Pawar: దేశంల ఉమ్మడి పౌరస్మృతిపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్-ఉమ్మడి పౌరస్మృతి) ఉండాలని ప్రభుత్వ అనుకూలురు వాదిస్తుంటే.. దానికి వ్యతిరేకంగా విపక్షాలు ముక్తకంఠంతో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ చర్చలోకి కొత్త అంశాన్ని తీసుకువచ్చారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. యూసీసీ మీద తర్వాత చూద్దాం కానీ ముందు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించండి అని ఆయన అన్నారు. గురువారం పూణెలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూసీసీ చర్చపై వివిధ వర్గాల సూచనలు, డిమాండ్లను అంచనా వేసిన తర్వాత ఎన్సీపీ తన వైఖరిని స్పష్టం చేస్తుందని పవార్ అన్నారు. అయితే అంతకంటే ముందుగా లోక్‌సభతో పాటు అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అని అన్నారు. 2019లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేల బృందంతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ యోచనలకు పవార్ గోప్యంగా ఉన్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా.. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఫడ్నవీస్ దృష్టి పెట్టాలని ఎన్సీపీ చీఫ్ సూచించారు.
ఇదే సందర్భంలో విపక్షాల రెండవ సమావేశం గురించి భారీ ప్రకటన చేశారు. ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట నడుస్తామని తేల్చి చెప్పాయి. అయితే ఆ సమావేశం అనంతరమే వచ్చే నెల జూలైలో మరో సమావేశం ఉంటుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాట్నా సమావేశం అనంతరం ప్రకటించారు.
వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10-12 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు అవచ్చాయి. అయితే ఆ సమావేశం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటకకు మారింది. జూలై 13 లేదంటే 14వ తేదీన బెంగళూరలో జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం ప్రకటించారు. ఇక ఈ విపక్షాల కూటమికి పేట్రియాటిక్ డెమొక్రటిక్ అలయన్స్ (పీడీఏ) అని పేరు పెట్టనున్నట్లు సమాచారం.