OBC Quota: ఓబీసీల సంఖ్యను బట్టి వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని పదే పదే వల్లెవేస్తున్న రాహుల్ గాంధీ.. వాస్తవంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపించింది. 50 శాతం ఓబీసీలు ఉంటారని స్వయంగా రాహుల్ గాంధే అంటున్నారు. కానీ ఏ రాష్ట్రంలోనూ 30 శాతానికి మించి ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించలేదు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ తీరుపై నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చాక చేసే హామీలు తర్వాత.. ముందు పార్టీ నుంచి ఇచ్చే టికెట్ల సంగతి చూడండంటూ చురకలు అంటిస్తున్నారు.
నిజానికి మహిళా రిజర్వేషన్ విషయంలోనూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇదే తీరును కనబరిచింది. 2019 సార్వత్రి ఎన్నికల్లో.. తాము అధికారంలోకి వస్తే 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ పదే పదే హామీలు ఇచ్చారు. నిజానికి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఈ నినాదం మీదే ప్రధానంగా సాగింది. కానీ తీరా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కేవలం 11 శాతం మహిళలకే టికెట్లు అందాయి. తాజాగా ఓబీసీల విషయంలోనూ ఇదే జరుగుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు 27 శాతమే కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో కేవలం 62 మంది ఓబీసీలకు మాత్రమే టికెట్లు దక్కాయి. రాజస్థాన్ పరిస్థితి చూస్తే.. మధ్యప్రదేశ్ కంటే కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక న్యాయం మాత్రం జరగలేదు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ లో ఓబీసీలకు 72 సీట్లు కేటాయించారు. ఇది 36 శాతం. ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 30 శాతం కంటే తక్కువ టికెట్లు ఓబీసీలకు టికెట్లు కేటాయించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి.