Assembly Elections 2023: రాజస్థాన్‭లో కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు.. సచిన్ పైలట్‭ను సీఎం చేయకపోవడంపై బీజేపీ వైపు మళ్లిన గుర్జర్లు

కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా జాతీయ నాయకత్వం మొత్తం పైలట్ కేంద్రంగా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించి, అలాగే చేసింది కూడా. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అశోక్ గెహ్లాట్‌ను సీఎం చేశారు

Assembly Elections 2023: రాజస్థాన్‭లో కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు.. సచిన్ పైలట్‭ను సీఎం చేయకపోవడంపై బీజేపీ వైపు మళ్లిన గుర్జర్లు

Gurjar Community: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గుర్జర్ సామాజికవర్గం ఆగ్రహం కాంగ్రెస్ ఆందోళనను మరింత పెంచింది. రాష్ట్రంలోని దాదాపు 50 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతున్న తొమ్మిది శాతం మంది గుర్జర్లను ఒప్పించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని భావించి కాంగ్రెస్‌కు ఓటేశామని, అయితే తమ నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని గుర్జర్ల సంఘం చెబుతోంది. 2018 ఎన్నికల సమయంలో రాజస్థాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పైలట్ ఉన్నారు.

బీజేపీకి మద్దతుగా గుర్జర్ వర్గం
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా జాతీయ నాయకత్వం మొత్తం పైలట్ కేంద్రంగా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించి, అలాగే చేసింది కూడా. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అశోక్ గెహ్లాట్‌ను సీఎం చేశారు. దీంతో తమ వర్గానికి ద్రోహం చేశారంటూ గుర్జార్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఆ వర్గం ప్రస్తుతం బీజేపీకి బహిరంగంగా మద్దతు పలుకుతోంది. (ఇది కూడా చదవండి: బీజేపీ ఓడిపోతే రాముడి దర్శనం ఉండదా? )

గుర్జార్ ఆధిపత్య ప్రాంతాల్లో వ్యతిరేకత
పైలట్ శిబిరం తిరుగుబాటు సమయంలో గెహ్లాట్ శిబిరంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్జర్ ఆధిపత్య అసెంబ్లీ నియోజకవర్గాలలో బహిరంగ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. గుర్జర్ వర్గీయుల ఆగ్రహాన్ని చూసి పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. రాహుల్, ప్రియాంక గాంధీ సూచనల మేరకు గత రెండు రోజుల నుంచి పైలట్ ఫోటోను పబ్లిసిటీలో ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. గుర్జర్ ఆధిపత్య ప్రాంతాలకు పైలట్ సందర్శనలు షెడ్యూల్ చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పైలట్‭ను సీఎం చేస్తానన్న గ్యారెంటీ ఏంటని గుర్జర్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

గెహ్లాట్ మద్దతుదారుల నిరసన
గెహ్లాట్ కేబినెట్‌లోని ఏకైక గుర్జర్ మంత్రి అశోక్ చంద్నాను ఆయన వర్గీయులే వ్యతిరేకిస్తున్నారు. హిందౌలీ అసెంబ్లీ నియోజకవర్గంలోని గుర్జర్లను ఒప్పించడం చందనాకు చాలా కష్టంగా మారింది. గెహ్లాట్ శిబిరం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న నద్‌బాయ్ ఎమ్మెల్యే జోగిందర్ సింగ్ అవానాపై మహాపంచాయత్ నిర్వహించాలని గుర్జర్ సంఘం నిర్ణయించి, ఆయనను తిరిగి నోయిడాకు పంపాలని నిర్ణయించింది. అవానా స్వయంగా గుర్జర్ కమ్యూనిటీకి చెందింది. వాస్తవానికి, నోయిడా నివాసి అయిన అవానా గత ఎన్నికల్లో బీఎస్పీ టిక్కెట్‌పై గెలిచి, కాంగ్రెస్‌లో చేరి గెహ్లాట్‌కు నమ్మకస్తుడిగా మారారు. పైలట్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన గెహ్లాట్ క్యాంపు మంత్రి మమతా భూపేష్, ఎమ్మెల్యే డానిష్ అబ్రార్, రోహిత్ బోహ్రా, ప్రశాంత్ బైర్వాలను గుర్జార్ ఆధిపత్య గ్రామాల్లోకి రానివ్వడం లేదు. (ఇది కూడా చదవండి: అమిత్ షాకు తప్పిన ప్రమాదం )

సచిన్ పైలట్‌కు డిమాండ్ పెరిగింది
దౌసా, కోటా, భరత్‌పూర్, సవాయి మాధోపూర్, కరౌలి, బుండి, జుంజును, అజ్మీర్, భిల్వారా, రాజ్‌సమంద్ వంటి గుర్జార్ ఆధిపత్య జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు తమ ఎన్నికల ప్రచారానికి పైలట్‌ను పిలవాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించారు. జైపూర్ జిల్లాలోని సుందర్‌పురా గ్రామానికి చెందిన ఉమ్రావ్ గుర్జార్ మాట్లాడుతూ, 2018లో పైలట్ సీఎం అవుతాడని సమాజం ఆశించినందున మేము కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని, కానీ తమకు ద్రోహం చేశారని అన్నారు.