Ram Mandir Politics: బీజేపీ ఓడిపోతే రాముడి దర్శనం ఉండదా? అమిత్ షా వ్యాఖ్యలపై రౌత్ అటాక్

హోంమంత్రి ప్రకటనపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాముడు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన అనుచరులు ప్రపంచం మొత్తం ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే, అక్కడి ప్రజలను దర్శనం చేయకుండా ఆపేస్తారా అని ప్రశ్నించారు

Ram Mandir Politics: బీజేపీ ఓడిపోతే రాముడి దర్శనం ఉండదా? అమిత్ షా వ్యాఖ్యలపై రౌత్ అటాక్

Assembly Elections 2023: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ మంగళవారం (నవంబర్ 14) అభ్యర్థించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు మతపరమైన సెంటిమెంట్లను వాడుకుంటున్నారని రౌత్ అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలపై శివసేన ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా చేసిన ఎన్నికల వాగ్దానం అనంతరం సంజయ్ రౌత్ పై విధంగా స్పందించారు. గుణ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నదని షా విమర్శించారు.

హోంమంత్రి ప్రకటనపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాముడు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన అనుచరులు ప్రపంచం మొత్తం ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే, అక్కడి ప్రజలను దర్శనం చేయకుండా ఆపేస్తారా అని ప్రశ్నించారు. ‘‘రామ్ లల్లా మొత్తం ప్రపంచానికి చెందినవాడు. మధ్యప్రదేశ్‌లో ఓడిపోతే మధ్యప్రదేశ్ ప్రజలు మీకు ఓటు వేయలేదని దర్శనం చేయకుండా ఆపేస్తారా? వారిపై కేసులు పెడతారా? మన దేశంలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి? దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.

230 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.