Meghalaya CM denial permission for PM Modi election rally meeting
Meghalaya: ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీలు నిర్వహించే సభలకు అనుమతి దొరక్కపోవడం అనేది మన దేశంలో సాధారణమైన విషయమే. ప్రతి ఎన్నికలోనూ ఇది కనిపిస్తూనే ఉంటుంది. అయితే అధికార పార్టీ మాట అంటుంచితే ఏకంగా దేశ ప్రధానమంత్రి సభకే అనుమతి లభించలేదు. ఈ సభను అడ్డుకున్నది కూడా మమతా బెనర్జీ, స్టాలినో కాదు.. అతి చిన్న రాష్ట్రమైన మేఘాయల ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు వేస్తోంది. అయితే ఇక్కడ సభ నిర్వహణ కుదరదంటూ మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 24వ తేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నందున, సైట్‌లో ఉంచిన మెటీరియల్ భద్రత కోసం సభకు అనుమతించడం లేదని సమాధానం వచ్చింది. ఇక్కడ కాకుండా మరే చోటైనా సభ ఏర్పాటు చేసుకునేలా చూడాలంటూ బీజేపీకి సూచించింది. ఇక అదే స్టేడియంలో సభ అనుమతి విషయమై పరిశీలిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే తెలిపారు.
Lok Sabha elections-2024: రాజీపడే ధోరణితో చర్చలు జరపాలి: విపక్షాల ఐక్యతపై చిదంబరం
ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే.. 127 కోట్ల రూపాయలతో నిర్మించిన అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియాన్ని గతేడాది 16న మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా ప్రారంభించారు. ఇది జరిగిన రెండు నెలల అనంతరం ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పడమేంటని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా మాట్లాడుతూ ‘‘కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మమ్మల్ని చూసి భయపడుతున్నారా? వారు మేఘాలయలో బీజేపీ వేవ్‌ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది. మీరు (సంగ్మా) ప్రధానమంత్రి మోదీ ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.