Rajasthan Politics: రాజస్థాన్ రాజకీయాలు ప్రస్తుతం.. సొంత పార్టీలో శతృత్వం, ఇతర పార్టీలతో స్నేహంలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల పొట్లాట ఎక్కడా కనిపించడం లేదు. ఇటు వైపు కాంగ్రెస్ లో వర్గాల పోరు, అటు వైపు బీజేపీలో అసంతృప్తుల తిరుగుబాటుతో పార్టీల్లో ఎక్కడికక్కడే నిప్పురవ్వలు గుప్పుమంటున్నాయి. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. తన వల్ల వసుంధర రాజేకు శిక్ష వేయడం సరికాదంటూ వ్యాఖ్యానించి ఆయన చర్చనీయంశమయ్యారు.
భాజపాలో వసుంధర రాజేను గెహ్లాట్ కారణంగానే నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గెహ్లాట్ ను విలేకరులు దీనిపై ప్రశ్నించగా.. తన వల్ల వసుంధరకు శిక్ష పడితే బీజేపీ నేతకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. ‘‘ఇది వారి పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే నా వల్ల ఆమెకు శిక్ష పడకూడదని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఆమెకు ద్రోహం చేసినట్టే అవుతుంది” అని అన్నారు.
ఇది కూడా చదవండి: RapidX Train now NaMo Bharat: రాపిడ్ ఎక్స్ రైళ్లకు నమో భారత్ అని పేరు మార్పు.. రేపే ప్రధాని మోదీచే ప్రారంభం
1990లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో బీజేపీ నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి భైరో సింగ్ షెకావత్ చికిత్స కోసం అమెరికా వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అందుకు బీజేపీ నేతలు కూడా మద్దతు ఇచ్చారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్న గెహ్లాట్ దాన్ని వ్యతిరేకించినట్లు తాజాగా వెల్లడించారు.
ఒకప్పుడు భాజపా సీనియర్ నేత కైలాష్ మేఘ్‌వాల్‌కు ఈ విషయం తెలుసని, 2020లో తమ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చే సంప్రదాయం లేదని సీఎం గెహ్లాట్ అన్నారు. మాజీ సీఎం మనోభావాలు కూడా మేఘ్వాల్‌లాగే ఉన్నాయని, వసుంధర మద్దతు ఎమ్మెల్యేలు తనకు చెప్పారని గెహ్లాట్ చెప్పారు. అయితే మేఘవాల్, వసుంధర అభిప్రాయలు ఒకే విధంగా ఉన్నాయని తాను అనుకోకుండా చెప్పానని, ఇప్పుడదే ఆమెకు కష్టాల్ని తీసుకువచ్చిందని గెహ్లాట్ అన్నారు.