Madhya Pradesh Politics: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రాజకీయం దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది. ఈ మూడు రాష్ట్రాలను హిందీ బెల్ట్ లోని ప్రధాన రాష్ట్రాలు అంటారు. ఈ రాష్ట్రాల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలదే హవా. ఈ రెండు పార్టీలను దాటి ఇప్పటి వరకు ఏ పార్టీ ఈ రాష్ట్రాల్లో అడుగుపెట్టలేదు. దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలే ఆ మూడు రాష్ట్రాలను పాలిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు చాలా ప్రతిష్టాత్మకం అయ్యాయి. పైగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరింత ప్రాధాన్యం పెరిగింది.
అయితే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ కంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి చాలా కీలకంగా మారింది. మూడు రాష్ట్రాల్లోనూ ప్రభావవంతగానే ఉన్న బీజేపీకి మధ్యప్రదేశే కీలకం కావడానికి కారణం.. బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం మధ్యప్రదేశ్ కావడం. బీజేపీకి మొదటిసారి అధికారం కట్టబెట్టడమే కాకుండా.. అన్ని వేళలా కాషాయ బలానికి కేంద్రంగా ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం బీజేపీకి ఎంతో కీలకం.
ఇది కూడా చదవండి: Assembly Elections 2023: బీజేపీ కంచు కోటలో కాంగ్రెస్ హల్ చల్.. ఛత్తీస్‌గఢ్ ఈసారి బీజేపీకి ఎందుకంత కీలకం?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. ఆ తర్వాత 2003లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరిగాయి. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే జోరు. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి రమణ్ సింగే ఏకైక ముఖ్యమంత్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ 2018లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీజేపీకి చెక్ పెట్టింది. ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెసే గెలుస్తుందని అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
రాజస్థాన్ పరిస్థితి మరోలా ఉంది. వాస్తవానికి ఆ రాష్ట్రం కూడా బీజేపీకి కీలకమే అయినప్పటికీ రాష్ట్రంలో అంతర్గత కుమ్ములాటలను అధిష్టానం కంట్రోల్ చేయలేకపోతోంది. బయటికి చెప్పకపోయినా వసుంధర రాజే వర్గమే ఇదంతా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కారణం ఆమె ప్రాధాన్యత తగ్గించడం. ఆమె వర్గానికి అధిష్టానం టికెట్లు సరిగా ఇవ్వకపోవడం. ఇంత జరుగుతున్నా.. వసుంధరకు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు విముఖంగానే ఉన్నారు. ఇది పార్టీకి కీడు చేస్తుందన్నప్పటికీ పట్టు విడవడం లేదు. ఇది చూస్తుంటే రాజస్థాన్ రాష్ట్రాన్ని బీజేపీ అధిష్టానం లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Assembly Elections 2023: రాజస్థాన్‌లో ఆ రికార్డ్‌ను కాంగ్రెస్ బీట్ చేస్తుందా? బీజేపీ పరిస్థితి ఏంటి?
ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం మీదే బీజేపీ ఎక్కువ ఫోకస్ చేసింది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివరాజ్ సింగ్ ప్రాధాన్యత తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అదంతగా వర్కౌట్ కాలేదు. దీంతో తిరిగి మళ్లీ శివరాజ్ రూట్లోకే బీజేపీ అధిష్టానం వచ్చింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర పథకాలు, మోదీ ఇమేజ్ ప్రచారం చేసుకునే బీజేపీ.. ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం శివరాజ్ ను ఎక్కువగా ప్రచారం చేస్తోంది. మధ్యప్రదేశ్ కు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా ఇలా ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. ఇవన్నీ బీజేపీ ప్రాభల్యం ఉన్న రాష్ట్రాలు. మధ్యప్రదేశ్ ను నిలుపుకుంటే ఆ ప్రభావం మిగతా రాష్ట్రాల మీద ఉంటుందని బీజేపీ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: అజాంకు ఎన్కౌంటర్ భయం.. పోలీసు వాహనంలో కూర్చునేందుకు భయపడి తండ్రిని, సోదరుడిని పట్టుకుని ఏడ్చాడు