Yennam Srinivas Reddy
10TV Gram Swarajyam : 10టీవీ నిర్వహించిన గ్రామ స్వరాజ్యం.. ‘సర్పంచ్‌ల సమ్మేళనం-2025’ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Mahabubnagar MLA Yennam Srinivas Reddy) పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది గ్రామీణ ప్రజలు అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలుఅర్పించిన 12మంది విద్యార్థులు కూడా గ్రామాల నుంచి వచ్చిన వారేనని అన్నారు. మనకోసం మనం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. 3లక్షల కోట్ల నిధులలో మన గ్రామాలకు నేరుగా వచ్చే నిధులు ఎన్ని అని అడిగే హక్కు ఉంది.. సమయం కూడా ఆసన్నమైందని అన్నారు.
Also Read : 10TV Gram Swarajyam : నూతన సర్పంచ్‌లు పట్టుదలతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి
నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి. 3లక్షలకోట్ల నిధుల్లో గ్రామాలకు వచ్చే నిధులెన్ని. సుమారు 12700 గ్రామాలకు ఒక్కో గ్రామానికి సంవత్సరానికి ఒక కోటి ఇచ్చినా.. 12,700 కోట్లు అవుతుంది. కేంద్రం ఇచ్చేది కాకుండా.. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మన గ్రామాల కోసం 12,700 కోట్లు ఖర్చుపెట్టలేని పరిస్థితుల్లో ఉందా అంటే.. ఉందనే చెప్పాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఒక ఎక్స్‌ప్రెస్‌వేకు 15వేల కోట్లు ఖర్చు పెడతాం. కానీ, ఎక్స్‌ప్రెస్‌వేకు వందలవేల గ్రామాలు ఉన్నాయి.. ఆ గ్రామాల పరిస్థితి ఏందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించిన రోజు గ్రామ స్వరాజ్యం వస్తుంది.. మన తెలంగాణ అభివృద్ధి అవుతుందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గతాన్ని తొవ్వితే లాభంలేదని, కనీసం ఇప్పటి నుంచైనా ఎందుకు నిధులు కేటాయించుకోవద్దు.. ఎందుకు నేరుగా గ్రామాలను అభివృద్ధికి చేసుకోవటానికి అన్ని వనరులను మనం వాడుకోవద్దు అనే విషయంపై దృష్టిసారించాలని అన్నారు.
ప్రతీ సంవత్సరం ఎమ్మెల్యేలకు రూ. 25కోట్లు ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇస్తే గ్రామాల సర్పంచ్ లకు ఇచ్చినట్లేనని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే ఆ నిధులు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికే ఉపయోగపడతాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
వ్యక్తి కంటే ఊరు ముఖ్యం.. ఊరు కంటే రాష్ట్రం ముఖ్యం.. రాష్ట్రం కంటే దేశం ముఖ్యం అని భావించే వ్యక్తిగా పార్టీల సంకెళ్లు తెంచుకొని మాట్లాడటానికి మాకు ఎటువంటి భయం లేదని అన్నారు. ఉద్యోగం వదిలేసిందే తెలంగాణ కోసం.. ఈరోజు రాజకీయాల్లో ఉన్నదే తెలంగాణ ప్రజల భాగోగుల కోసం. తప్పు ఎవరు చేసినా నిలదీయాల్సిందే.. సూచనలు ఇవ్వాల్సిందేనని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్పంచ్ లు మీ అభిప్రాయాలును చెప్పండి.. మేమందరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని.. ఈ అవకాశం కల్పించిన 10టీవీకి ధన్యవాదాలు తెలిపారు.